కాంగ్రెస్ అసంతృప్తులకు కమలం పార్టీ గాలం!

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. 21 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ప్రకటించింది. ఇప్పటికే మెజారిటీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలకు అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. 24 అసెంబ్లీ స్థానాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల్ని సమన్వయకర్తలుగా నియమించింది. అభ్యర్థుల గెలుపు బాధ్యతను వారిపై ఉంచింది.
మరోవైపు.. గత వారం రోజులుగా బీజేపీలో చేరికలు జోరందుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అసంతృప్తులకు కమలం పార్టీ గాలం వేస్తోంది. కాంగ్రెస్‌కు పలువురు నాయకులు రాజీనామా చేసి ఇప్పటికే బీజేపీలో చేరగా.. వారి బాటలో మరికొంత మంది పయనిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ భూపేంద్రయాదవ్ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. గ్రేటర్‌లో బీజేపీ గెలుపు వందశాతం ఖాయమని బండ కార్తీక రెడ్డి అన్నారు.
అటు..శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత భిక్షపతి యాదవ్ హస్తాన్ని వీడి బీజేపీలో చేరారు. ఆయన కుమారుడు రవికుమార్ యాదవ్ కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. మొత్తంగా వరుస చేరికలతో హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.
చేరికలు కమలం పార్టీలో జోష్‌ను పెంచుతుంటే.. హస్తం పార్టీలో నైరాశ్యాన్ని మిగుల్చుతున్నాయి. భిక్షపతి యాదవ్ బీజేపీ గూటికి వెళ్తున్నారని తెలియడంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు. కానీ ఉత్తమ్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అయితే, భిక్షపతి యాదవ్ బీజేపీలో చేరినా పార్టీ కేడర్ మాత్రం ఎక్కడికీ వెళ్లలేదని హస్తం నేతలు సమర్థించుకుంటున్నారు.. శేరిలింగంపల్లి ముఖ్య నేతలంతా గాంధీ భవన్‌కు క్యూ కట్టారు.. రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపారు.. గురువారం శేరిలింగంపల్లి విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు.
ఓ వైపు నేతలను బుజ్జగిస్తూనే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది పీసీసీ.. నామినేషన్లకు మరో రోజు మాత్రమే గడువు ఉండటంతో కసరత్తు ముమ్మరం చేసింది. 29 మందితో మొదటి జాబితా.. 16 మందితో రెండో జాబితా విడుదల చేసింది. రెండు జాబితాల్లో కలిపి 45 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. గురువారం మిగతా అభ్యర్థులను ఖరారు చేసేలా కసరత్తు చేస్తున్నారు. అటు ఇప్పటికే లిస్ట్‌ను ఆమోదం కోసం హైకమాండ్‌కు పంపింది పీసీసీ. అటు మేనిఫెస్టో విడుదలపైనా కాంగ్రెస్ నేతలు సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. మరోవైపు టికెట్ ఆశిస్తున్న ఆశావహులతో గాంధీభవన్ దగ్గర కోలాహలం నెలకొంది.
అసంతృప్తులు ఓ వైపు.. అలకలు మరో వైపు.. పార్టీని వీడుతున్న వారు ఇంకో వైపు.. ఇంటిపోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ గ్రేటర్ వార్‌ను ఎలా హ్యాండిల్ చేస్తోందో అనే సందేహాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com