గ్రేటర్ ఎన్నికలు.. బీజేపీ నేతలకు కొత్త తలనొప్పులు

నామినేషన్ల ప్రక్రియ ముగిసినా గ్రేటర్ బరిలో ఉన్న అభ్యర్థుల ఆశలు ఆవిరి కాలేదు. ఉపసంహరణకు సమయం ఉండటంతో చివరి వరకు ప్రయత్నాలు చేసే పనిలో పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ఆశావాహులు క్యూ కడుతున్నారు. ఫలితంగా నేతలకు కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. పార్టీ తరఫున పోటీ చేసే వారికి బీఫామ్‌లు ఇస్తున్నా.. టికెట్ రాని బీజేపీ కార్యకర్తలు నామినేషన్‌లు వేయడంతో వారిని బుజ్జగించేందుకు సీనియర్లు రంగంలోకి దిగారు. డివిజన్‌ల వారీగా నియమించిన ఇంఛార్జ్‌లు మంతనాలు జరుపుతున్నారు. పార్టీ ఎదుగుదల కోసం కలిసి పని చేద్దామని.. కష్టపడి పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు వస్తుందని.. తిరుగుబాటు అభ్యర్థుల్ని దారికి తెచ్చుకుంటున్నారు.
మరోవైపు.. నామినేషన్ల పర్వం కొనసాగుతుండగానే ఆపరేషన్ ఆకర్ష్‌కు బీజేపీ నాయకులు తెరలేపారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ఆకర్ష్ ఉధృతం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణతో చర్చలు సఫలం కావడంతో ఆయన పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇక మరోవైపు మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితోనూ మంతనాలు జరిపారని తెలుస్తోంది. ఈ వార్తలను ఆయా నేతలు ఖండించారు. అటు... మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ నివాసానికి వెళ్లిన కిషన్‌రెడ్డి..చర్చలు జరిపారు.
వరదసాయం ఆపాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లేఖ రాశారంటూ టీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేయడంపై మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్ చెప్పినట్టే ఈసీ నడుస్తోందిని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు. భాగ్యలక్ష్మి ఆలయానికి తాను ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు. ఏ ఆలయానికి రమ్మంటాలో టీఆర్‌ఎస్ నేతలే చెప్పాలని స్పష్టంచేశారు.
అభ్యర్థుల ఖరారు, బుజ్జగింపులతో బీజేపీ ముఖ్యనేతలు బిజీగా ఉన్నప్పటికీ.. ప్రచారంలోనూ వెనుక పడటం లేదు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, బూత్ స్థాయి నేతలు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీని గెలిపిస్తే..కేంద్ర ప్రభుత్వ నిధులతో హైదరాబాద్‌ను వేగంగా అభివృద్ది చేస్తామని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com