మందుబాబులకు మంచి కిక్కుచ్చిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. మందుబాబులకు మంచి కిక్కునిచ్చాయి. దీంతో పాటు సర్కారు ఖజానాకు కాసులు కురిపించాయి. ఓటరు దేవుణ్ని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు మందు సరఫరా భారీగానే చేసినట్టు స్పష్టమవుతోంది. గత నెల నవంబర్‌లో.. పెద్దఎత్తున మద్యం విక్రయాలు జరిగాయి. మామూలుగా రాష్ట్రంలో నెలకు సగటున 17వందల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. కానీ నవంబర్‌లో జనం 2వేల 5వందల 67 కోట్ల రూపాయల మద్యం తాగేశారని ఎక్సైజ్‌శాఖ స్పష్టంచేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నవంబర్‌లో అత్యధిక సేల్స్ జరగడం ఇదే తొలిసారి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు..31లక్షల కేసుల లిక్కర్, 23లక్షల కేసుల బీర్..డిపోల నుంచి వైన్ షాపులకు సరఫరా అయింది. లిక్కర్, బీర్ల అమ్మకాల మొత్తం విలువ 2వేల 5వందల 67 కోట్లు ఉంటుందని తెలిపారు.
నవంబర్ నెలంతా విక్రయాలు భారీగా ఉండగా.. ఇందులో కేవలం మూడు రోజుల్లోనే 860 కోట్ల రూపాయల మద్యాన్ని మందుబాబులు లాగించేశారు. నవంబర్ 26 నుంచి 28 మధ్య మూడు రోజుల్లో జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 1న జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ఉన్నందున.. నవంబర్ 29వ తేదీ సాయంత్రం నుంచి డిసెంబర్ 1 సాయంత్రం వరకు వైన్ షాపులు, బార్లు మూసివేశారు. వైన్ షాపులు బంద్ ఉంటాయని తెలిసి.. ముందుగానే భారీగా కొనుగోళ్లు చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి.. తెలంగాణలో రోజురోజుకు మద్యం విక్రయాలు మాత్రం భారీగా పెరుగుతన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com