ఏ తప్పు చేయలేదు కాబట్టే అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేశా : సంజయ్

సీఎం కేసీఆర్ తన స్థాయి దిగజారి ప్రవర్తించడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. తాను విసిరిన సవాల్ కు ఇంతవరకు కేసీఆర్ స్పందించలేదంటే.. తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని తేటతెల్లమైందని తెలిపారు. తప్పుడు ప్రచారాలతో, చిల్లర రాజకీయాలతో గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడి సంతకాన్ని ఫోర్జర్ చేస్తారా అని ప్రశ్నించారు. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేశానని స్పష్టంచేశారు.
మతం పేరుతో ఎన్నికల్లో ఓ వర్గం ఓట్ల కోసం కేసీఆర్ పాకులాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ ను ఎంఐఎం పార్టీకి కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో టీఆర్ఎస్, ఎంఐఎం ఆగడాలు ఇకపై సాగనివ్వమని హెచ్చరించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మేయర్ పీఠం కట్టపడితే వరద సాయం 25వేల రూపాయల సాయం చేస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోని పేదలకు న్యాయం జరగాలంటే పేదల పార్టీ అయిన బీజేపీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం నుంచి నేరుగా పాతబస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్న సంజయ్ నేరుగా ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి తాను ఈసీకి లేఖ రాయలేదని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి వెనుదిరిగారు. ఈ సమయంలో బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు.
మరోవైపు శుక్రవారం కావడంతో మక్కా మసీదులో ముస్లింలు ప్రార్థనలకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు భారీ బందోబస్తు ఏర్పాటుచేశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com