శనివారం ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ సభ.. స్టేడియంలో మూడు వేదికలు ఏర్పాటు

శనివారం ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ సభ.. స్టేడియంలో మూడు వేదికలు ఏర్పాటు

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం ఆఖరి దశకు వచ్చేస్తోంది. గ్రేటర్‌ ప్రచారంలో భాగంగా.. సీఎం కేసీఆర్‌ శనివారం భారీ బహిరంగ సభలో ప్రసంగించున్నారు. ఇందుకోసం ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు గులాబీ నేతలు. గ్రేటర్‌ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొంటున ఏకైక సభ కావడంతో .. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు టీఆర్‌ఎస్ నేతలు. ప్రచార గడువు ముగియడానికి సరిగ్గా 24 గంటల ముందు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న కేసీఆర్‌ సభను విజయవంతం చేయడం ద్వారా ప్రజల్లోకి సానుకూల సంకేతాలు తీసుకెళ్లాలని భావిస్తోంది టీఆర్‌ఎస్‌. ఈ సభకు దాదాపు రెండుల లక్షల మందికి పైగా సమీకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

కొవిడ్‌ నిబంధనలకు లోబడి ఈ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఉచితంగా పంపిణీ చేయడానికి 2 లక్షల మాస్క్‌లను సిద్ధం చేశారు. ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ఉండే గోషామహల్‌, ఖైరతాబాద్‌, అంబర్‌పేట, ముషీరాబాద్‌ తదితర అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి నుంచి పాదయాత్రలుగా జనాన్ని తరలించబోతున్నారు. సీఎం, మంత్రులు, వీవీఐపీలు, కార్పొరేటర్‌ అభ్యర్థులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దారుల్లో స్టేడియంలోకి రానున్నారు. ఇక .. సీఎం కేసీఆర్‌ సభ కోసం స్టేడియంలో మూడు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదికపై నుంచి కేసీఆర్‌ ప్రసంగిస్తారు. అదే వేదికపై మంత్రులు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూర్చునే అవకాశం ఇస్తున్నారు. కుడి వైపున కళాకారుల ప్రదర్శనల కోసం ఒక వేదిక, ఎడమ వైపున టీఆర్‌ఎస్‌ తరఫున జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూర్చోవడానికి మరో వేదిక సిద్ధం చేస్తున్నారు. స్టేడియం లోపల, వెలుపల ఆరు భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నారు.

శుక్రవారం సాయంత్రానికి సభ ఏర్పాట్లన్నీ పూర్తవుతాయంటున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. గురువారం వరకు ప్రధాన వేదిక నిర్మాణం, అలంకరణ కొలిక్కి వచ్చాయి. శనివాం సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభ మొదలు కానుంది. కేసీఆర్‌ ప్రసంగం తదుపరి 6 గంటలకు సభను ముగించేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇదే ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ ప్రచార సభను జన సమీకరణ లోపం వల్ల టీఆర్‌ఎస్‌ నాయకత్వం చివరి నిమిషంలో రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఆయన హాజరయ్యే ప్రచార సభ ఏర్పాట్లను పార్టీ ముఖ్యులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.



Tags

Next Story