జీహెచ్ఎంసీ ఎన్నికలు : ఈసీ నిబంధనలు ఇవే..

తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నది గ్రేటర్ హైదరాబాద్‌లోనే. అందుకే, తగు జాగ్రత్తలతో ప్రచారం చేయాలని కండీషన్ పెట్టింది ఈసీ. ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలు, రోడ్‌షోలపై స్పష్టమైన రూల్స్ విధించింది. ఇదివరకటిలా ఎలా పడితే అలా ప్రచారానికి వెళ్తామంటే కుదరదు.
నేతలు ప్రచారానికి వాడే కాన్వాయ్‌లో రెండు వాహనాలు మాత్రమే ఉండాలి. కాన్వాయ్‌లో రెండు వాహనాల మధ్య కనీసం వంద మీటర్ల దూరం ఉండాలి. ప్రచారం చేసే వాళ్లు కూడా భౌతిక దూరం పాటించాలి. ఇంటింటి ప్రచారంలోనూ ఆంక్షలు ఉన్నాయి. భద్రతా సిబ్బంది మినహా ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. హైదరాబాద్ సిటీలో నేతల ఉపన్యాసాలు ఎక్కువ మందికి చేరాలంటే రోడ్‌షోలే దిక్కు. ఎందుకంటే బహిరంగ సభలకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వబోమని చెప్పేసింది. కరోనా కారణంగా రోడ్‌షోల పైనా నిబంధనలు పెట్టారు. పార్టీల అభ్యర్థుల రోడ్ షోలకు మధ్య కనీసం అరగంట విరామం ఉండాలని చెప్పింది ఎస్ఈసీ. ఎన్నికల ప్రచారంలో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కేసులు తప్పవని హెచ్చరించింది.
నామినేషన్ సమయంలో అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. ర్యాలీగా వచ్చి నామినేషన్ సమర్పించడాన్ని ఒప్పుకోరు. ఓటర్లకు కూడా నిబంధనలు ఉన్నాయి. పోలింగ్ రోజు చేతులను శానిటైజ్ చేసుకోవడంతో పాటు, ఫేస్ మాస్క్ ధరించడం, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వారు, నోటిఫైడ్ అత్యవసర సేవల్లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవచ్చు. ఓట్ల లెక్కింపు రోజున ఒక కౌంటింగ్ హాల్‌లో 10 కౌంటింగ్ టేబుళ్లకు మించి ఉండకూడదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com