జీహెచ్ఎంసీ ఎన్నికలు.. నేనొక్కడినే ఓటు వేయకపోతే ఏమవుతుందిలే..! అనుకుంటున్నారా?

మెట్రో పాలిటన్ నగరం.. భిన్న వర్గాలు, విభిన్న సంస్కృతులు. అక్షరాస్యత 85 శాతం. విద్యావంతులకు కొదవ లేదు. రాజకీయ చైతన్య కేంద్రం. పరిపాలన నిలయం. ఐటీ హబ్. ఎన్నో విశిష్ఠతలతో దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగిన మహా నగరం. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం సగటు పౌరుడు సగర్వంగా కాలర్ ఎగరేయలేని పరిస్థితి. ప్రతి సారీ తక్కువగా నమోదవుతున్న పోలింగ్.. అధికారులు, రాజకీయ విశ్లేషకులకూ అంతుపట్టడం లేదు. హైదరాబాద్‌లో అంతేలే.. ఆ మాత్రం పోలింగ్ జరగడమే ఎక్కువ అనుకునే పరిస్థితి. నగరంలో ఇదో ట్రెండ్‌గా మారింది. గతంలోనూ ఎన్నికల పోలింగ్ పరిస్థితి అంతంత మాత్రమే. సిటీలో ఇప్పటివరకు 60 శాతం పోలింగ్ నమోదైన దాఖలాలు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఓ రోజు సెలవు వచ్చిందనో, సరదాగా బయటకు టూర్ వెళ్లొచ్చనో, హమ్మయ్య ఇంట్లోనే విశ్రాంతి తీసుకునే అవకాశం దొరికిందనుకునే జనం వల్ల నగరానికే అపఖ్యాతి వస్తోంది. రాజకీయాలతో తమకు ఏమి ఒరిగిందనే తీవ్రమైన అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తోందా.. లేక నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందనే నిర్లిప్తతనో అంతుపట్టడం లేదు. ఓటింగ్ కోసం ప్రభుత్వం ఇచ్చిన హాలీడేను.. జాలీడేగా భావిస్తే.. సమర్థులైన నేతల్ని ఎన్నుకునేదెవరు...?
జీహెచ్‌ఎంసీ గత ఎన్నికలతో పోల్చితే... ఈ సారి హోరాహోరీ జరిగిందని చెప్పవచ్చు. పార్టీలు పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలతో జోరుగా ప్రచారం నిర్వహించాయి. నేతల రోడ్‌షోలు, మీటింగ్‌లకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. భారీగా పోలింగ్ నమోదవుతుందని పలువురు అంచనా వేశారు. రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, అధికారులు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కలిగించారు. ఓటు వేస్తేనే ప్రశ్నించే అధికారం ఉంటుందని చెప్పారు. బంగారం లాంటి భవిష్యత్ కోసం ఇంటి నుంచి బయటకు వద్దామని తెలిపారు. సమర్థుల్ని ఎన్నుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని చెప్పారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎలా ఓటు వేయాలో ప్రచార చిత్రాల ద్వారా వివరించారు. కానీ.. నగర పౌరులు మరోసారి ఇంటికే పరిమితమయ్యారు.
చాలా పోలింగ్ కేంద్రాల వద్ద హృదయాన్ని కదిలించే, ఆలోచింపచేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. కనీసం నడవడానికి కూడా శక్తి సరిపోక... అడుగులో అడుగు వేసుకుంటూ కొందరు వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. దివ్యాంగులు ఒంటికాలిపై వచ్చి... ఓటు వేసి వెళ్తున్నారు. మరి చదువుకున్న, చైతన్యం కలిగిన యువతకు ఏమైంది...? సోషల్ మీడియాలో రాజకీయ రచ్చలో పాల్గొనడం, దేశ, రాష్ట్ర రాజకీయాల గురించి పోస్టులు పెట్టడం, అభిమాననేతల పోస్టులకు లైకులు కొట్టడం కొందరికి నిత్యకృత్యం. సోషల్ మీడియాలో చూపే చైతన్యం వాస్తవానికి వచ్చే సరికి ఎందుకు ఆచరణలో పెట్టడం లేదో అంతుచిక్కని విషయం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com