@9am update.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

@9am update.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయినట్లుగా తెలుస్తోంది.. పోస్టల్‌ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం కనబడుతోంది. హయత్‌ నగర్‌లోని సర్కిల్‌లో బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇక్కడ మూడు డివిజన్లలో బీజేపీ.. ఒక డివిజన్‌లో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం వచ్చింది. హయత్‌ నగర్, మన్సూరాబాద్, నాగోల్‌ డివిజన్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌లో బీజేపీ.. బీఎన్‌ రెడ్డి నగర్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యత కనబర్చాయి. ఎల్‌బీ నగర్‌ నియోజకవర్గంలో 11 డివిజన్లలో 10 డివిజన్లలో బీజేపీకి.. ఒక్క డివిజన్‌లో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం కన్పించింది. కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌లో రెండు డివిజన్లలో బీజేపీకి, రెండు డివిజన్లలో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యత వచ్చింది. ఉప్పల్‌ సర్కిల్‌లోని చిలుకా నగర్‌ డివిజన్‌లో బీజేపీ-4, టీఆర్‌ఎస్‌-3, కాంగ్రెస్‌ ఒక చోటు ఆధిక్యతలో ఉన్నాయి. గాజుల రామారం డివిజన్‌లో బీజేపీ-3, టీఆర్‌ఎస్‌-3, కాంగ్రెస్‌ ఒక్క చోట ఆధిక్యంలో ఉన్నాయి. జగద్గిరిగుట్ట డివిజన్‌లో బీజేపీ ఒక చోట.. టీఆర్‌ఎస్‌ ఒక చోట ఆధిక్యంలో ఉన్నాయి. మాదాపూర్‌ డివిజన్‌లో ఫలితాలు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 30 కేంద్రాల్లో 150 కౌంటింగ్ హాళ్లలో ఈ లెక్కింపు జరుగుతోంది. ఒక్కో రౌండ్‌లో 14 వేల ఓట్లు లెక్కించనున్నారు. ఐతే.. 12 వేల లోపు ఓట్లు పోలైన మెహదీపట్నం ఫలితం ముందుగా వచ్చే ఛాన్స్ ఉంది. అత్యధికంగా 37 వేల ఓట్లు పోలైన మైలార్‌దేవ్‌పల్లిలో కౌంటింగ్‌ పూర్తి కావాలంటే సాయంత్రం అవుతుంది. అలాగే గాజులరామారం, అల్లాపూర్‌ సహా మరికొన్ని చోట్ల కూడా ఫలితం తేలాలంటే మరింత సమయం పడుతుంది. గతంలో EVMల ద్వారా ఓటింగ్ కాబట్టి.. తొలి రెండు గంటల్లోనే ట్రెండ్ తెలిసిపోవడం, ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయో అర్థమవడం జరిగిపోయేది. కానీ ఈసారి బ్యాలెట్ పోరు కావడంతో రిజల్ట్ ఆలస్యం కానుంది.

బ్యాలెట్‌ బాక్స్‌ల్లో ఓట్లను 25 చొప్పున కట్టలు కడుతున్నారు. పోలైన ఓట్లు, బాక్సులో ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరిచూసుకుంటారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోని బాక్సుల్లో ఓట్లు.. కట్టలు కట్టాక వాటిని ఓ డ్రమ్‌లో వేసి కలుపుతారు. ఏ వార్డులో ఏ పార్టీకి మెజార్టీ వచ్చింది.. లాంటి వివరాలు బయటకు తెలియకుండా ఉండడం కోసం ఇలా చేస్తారు. ఆ తర్వాత పార్టీల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించి రౌండ్ల వారీగా ఫలితాలు ప్రకటిస్తారు. ఒక్కో టేబుల్‌పైన వెయ్యి ఓట్లు లెక్కిస్తారు. అలా ఒక రౌండ్‌లో 14 వేల ఓట్లు లెక్కిస్తారు. క్యాండేట్ల వారీగా చెల్లుబాటు అయిన ఓట్లు ప్రకటించాక, రీకౌంటింగ్‌ లాంటి డిమాండ్‌లు ఏమీ ఏజెంట్ల నుంచి రాకపోతే రిటర్నింగ్ అధికారి ఫలితాన్ని ప్రకటిస్తారు. డౌట్ ఫుల్ ఓట్ల విషయంలో రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం. ఒకవేళ ఎక్కడైనా డివిజన్‌లో అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లక్కీ డ్రా ద్వారా విజేతను ప్రకటిస్తారు.

కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేస్తున్నారు. సర్కిళ్ల వారీగా ఎన్నికల సంఘం నియమించిన అబ్జర్వర్లు కౌంటింగ్‌ పర్యవేక్షిస్తున్నారు. IAS, IPS, IFS సహా డిప్యూటీ కలెక్టర్లు 31 మందికి ఆ బాధ్యతల్లో ఉన్నారు. మరోవైపు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 50వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story