జీహెచ్ఎంసి ఎన్నికలు : ఈనెల 18న షెడ్యూల్ వస్తుందా?

హైదరాబాద్ నగరంలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల అధికారుల సమాచారం ప్రకారం ఈ నెల 18న ఎన్నికల షెడ్యూల్.. 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే డిసెంబర్ 4న లేదా 7వ తేదీన పోలింగ్ జరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ టీఆర్ఎస్ దూసుకుపోతుంది. ఈ క్రమంలో గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు కురిపించింది.
దీపావళి కానుకగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు, పారిశుద్ధ్య కార్మికులకు వరాల జల్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. 2020-21 సంవత్సరానికి ఆస్తిపన్నులో ప్రజలకు రిలీఫ్ కల్పించారు. GHMC పరిధిలో 15 వేల లోపు పన్ను కట్టే వారికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇతర పట్టణాల్లో కూడా 10వేలలోపు కట్టేవారికి 50 శాతం రిలీఫ్ ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఒకటే రోజు లక్ష కుటుంబాలకు 10 వేల చొప్పున వరద సాయం అందించామని కేటీఆర్ చెప్పారు. వరద సాయం అందని బాధితులు.. మీ సేవ సెంటర్లలో అప్లికేషన్లను పూర్తిచేసి ఇవ్వాలని సూచించారు. అర్హులైన వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు GHMC పారిశుద్ధ్య కార్మికులకు కూడా దీపావళి కానుక ప్రకటించారు కేటీఆర్. నగరంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాన్ని మూడు వేలు పెంచుతున్నట్లు తెలిపారు. దీంతో కార్మికుల జీతం 14వేల 500 నుంచి 17 వేల 500కు పెరిగిందన్నారు. అధికారపార్టీ పక్కా ప్లాన్ ప్రకారం ఎన్నికలకు సన్నద్ధమవుతుండగా.. ప్రతిపక్షాలు కూడా ప్రచారజోరు పెంచాయి. దీంతో నగరంలో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణం కనపడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com