హైదరాబాద్‌లో వరద సాయంపై టీఆర్‌ఎస్, బీజేపీ మాటలయుద్ధం

GHMC ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమల్లోకి రావడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న వరద సాయం ఆపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడిదే రాజకీయ రచ్చకు కారణమైంది. అధికార-ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వదర సాయానికి బ్రేక్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీనే వరద సాయాన్ని నిలిపేలా చేసిందని ఆరోపించారు. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకే ఎన్నికల సంఘం వరద సాయాన్ని నిలిపివేసిందన్నారు. అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్నట్లు బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
బీజేపీయే వరద సాయం ఆపించేసిందని ఛార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయంలో ప్రమాణం చేస్తారా అంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. వరద సాయాన్ని ఆపాలని ఎస్ఈసీకి తాను లేఖ రాయలేదని.. తన సంతకాన్ని టీఆర్ఎస్ పార్టీనే ఫోర్జరీ చేసిందని ఆయన ఆరోపించారు. తన లెటర్ ప్యాడ్‌పై సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాల వల్ల బాధితులైన ముంపు ప్రాంతాల ప్రజలకు వరదసాయం పేరిట కేసీఆర్ సర్కారు నోట్ల రాజకీయానికి పాల్పడిందన్నారు విజయశాంతి. భారీ వర్షాలు కురిసి 3 వారాలైనా ముంపు బాధితలకు పరిహారం అందించలేకపోయారన్నారు. ఇచ్చిన పరిహారం కూడా అపహాస్యం పాలైందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ నేతలు సూచించిన వారికి మాత్రమే.. వరదసాయం చేస్తున్నారంటూ విమర్శించారు. నిజమైన బాధితులను విస్మరించారన్నారు. మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోమని చెప్పి మహిళ మృతికి కారణమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు.. టీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వరద రాజకీయం చేస్తున్నాయని కాంగ్రెస్ మండిపడింది. అకౌంట్లో డబ్బులు వేస్తే టీఆర్‌ఎస్ నేతలకు కమిషన్లు రావని.. ఓట్లు కూడా రావనే అనుమానంతో వరద సాయాన్ని ఆపేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వరదలతో సర్వం కోల్పోయిన వారికి వెంటనే సాయం అందించాలని డిమాండ్ చేశారు.
మొత్తానికి గ్రేటర్‌లో నామినేషన్ల పర్వానికి తెరతీసిన రోజే.. వరద రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. ఇదే అంశం GHMC ఓటర్లపైనా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com