జీహెచ్ఎంసీ మేయర్ రేసులో ఆరుగురు మహిళలు.. ఆమెకు మేయర్ పదవి ఇస్తారా?

జీహెచ్ఎంసీ మేయర్ రేసులో ఆరుగురు మహిళలు.. ఆమెకు మేయర్ పదవి ఇస్తారా?
టీఆర్‌ఎస్‌.. మేయర్ పదవి మహిళకేనని అనౌన్స్ చేసింది. తీరా చూస్తే హంగ్ ఏర్పడింది.

GHMC కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక కోసం అధికార పార్టీ ఇప్పటికే వడపోత మొదలుపెట్టగా.. ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్నారు. మరోవైపు బల్దియా నూతన పాలక మండలి ఏర్పాటుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

జీహెచ్‌ఎంసీలో ఫుల్ మెజారీటి తమదేనన్న టీఆర్‌ఎస్‌.. మేయర్ పదవి మహిళకేనని అనౌన్స్ చేసింది. తీరా చూస్తే హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరికి వెళ్తాయి, మహిళకు మేయర్ పదవి ఇస్తారా అనేది పెద్ద సందిగ్ధం. క్షేత్రస్థాయిలో ఇంతటి గందరగోళం కనిపిస్తుంటే.. మేయర్ సీటును కోసం ఏకంగా అరడజనుకు పైగా మహిళా కార్పోరేటర్లు రేసులో నిల్చున్నారు.

హఫీజ్ పేట్, మాదాపూర్ రెండు డివిజన్లలో వరుసగా రెండుసార్లు TRS నుంచి గెలిచిన పూజిత, జగదీశ్వర్ గౌడ్ దంపతులు.. మేయర్‌గా తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. 2009లో మేయర్ పదవి వచ్చినట్లే వచ్చి చేయి దాటిపోయిందనేది వీరి వాదన. ఈసారి తమకే మేయర్ పీఠం దక్కుతుందని పూజిత, జగదీశ్వర్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూజితకు మేయర్‌గా అవకాశం కల్పించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ద్వారా లాబీయింగ్ చేస్తున్నారు జగదీశ్వర్ గౌడ్.

శ్రీ వెంకటేశ్వర కాలనీ నుంచి రెండుసార్లు గెలిచిన మన్నే కవితా రెడ్డి.. ఈమధ్య కేటీఆర్‌ను కలిసి తనకు మేయర్‌గా అవకాశం ఇవ్వాలని కోరారు. మొదటి నుంచి TRSను నమ్ముకుని ఉన్న మన్నే గోవర్ధన్ రెడ్డి ఫ్యామిలీకి న్యాయం చేస్తానని KTR పలుమార్లు చెప్పారు. TRS పార్టీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా తమకు ఎలాంటి పదవులు దక్కలేదని, ఈసారైనా మేయర్ పదవి దక్కించుకోవాలని మన్నే కవితా రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్‌, కవితను కలిసొచ్చిన మన్నే కవిత.. మేయర్ పదవి తమదేనంటూ చెప్పుకుంటున్నారు.

మరోవైపు ఖైరతాబాద్ కార్పోరేటర్ విజయారెడ్డి వరుసగా రెండుసార్లు గెలవడంతో PJR ఛరిష్మాతో మేయర్ కాబోతున్నారని ఆమె అనుచరులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. 2016లో మేయర్ పదవి కోసం ప్రయత్నం చేసినా దక్కలేదు. ఈసారి మేయర్‌ పదవి పక్కాగా తనకే అని విజయారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీదేవి శోభన్ రెడ్డి, భారతీనగర్ కార్పోరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి కూడా మేయర్ రేస్‌లో ఉన్నారు. మేయర్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో డిప్యూటీ మేయర్ పదవి మైనార్టీ వర్గానికే వస్తుందన్న ప్రచారం సాగుతోంది. దీంతో డిప్యూటీ మేయర్ పదవి కోసం పలువురు మైనార్టీ కార్పొరేటర్లు పోటీ పడుతున్నారు. ప్రస్తుత డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌ను మళ్లీ కొనసాగిస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

మరోవైపు GHMC నూతన పాలక మండలి ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు బల్దియాలో నూతనంగా ఎంపికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు GHMC మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్వేతామహంతి.. జీహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు.

GHMC కౌన్సిల్ హాల్‌ను పరిశీలించిన శ్వేతామహంతి.. ఎక్స్ అఫీషియో, కార్పొరేటర్లకు పార్టీల వారిగా సీట్ల కేటాయింపు, కౌన్సిల్ హాల్‌లోకి ప్రవేశం, మీడియా ఎన్‌క్లోజర్ వంటి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. 11న జరిగే సమావేశాన్ని వీడియో చేయించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story