GHMC : మహిళా క్రికెటర్ ఇంటిని కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు
GHMC : మహిళా క్రికెటర్ భోగి శ్రావణి ఇంటిని జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేసిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. మరమ్మతులు చేయించామని ఎంత మొత్తుకుంటున్నా వినకుండా దౌర్జన్యంగా తన ఇంటిని కూలగొట్టేశారంటూ మహిళా క్రికెటర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మనస్తాపానికి గురైన ఆమె తండ్రి మల్లేష్ సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. అటు ఈనెల 15 నుంచి పుదుచ్చేరిలో జరిగే మహిళా టీ 20 టోర్నమెంట్‌లో భోగి శ్రావణి పాల్గొనాల్సి ఉంది.. ఈ పరిస్థితుల్లో టోర్నీకి వెళ్లాలో వద్దో అర్థంకాక తీవ్ర ఆవేదనలో ఉండిపోయింది.
తుకారాంగేట్ పీఎస్ పరిధిలోని అడ్డగుట్టలో మహిళా క్రికెటర్ శ్రావణి కుటుంబం నివసిస్తోంది.. ఆమె తండ్రి మల్లేష్ ప్లంబర్‌గా పనిచేస్తున్నారు.. అయితే, వారున్న ఇంటి వెనుక ఏగోడ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఇటీవలే జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు.. అయితే, అధికారులు చెప్పినట్లుగా గోడకు మరమ్మతులు చేయించారు.. కానీ, ఆ గోడను పరిశీలించకుండానే జీహెచ్‌ఎంసీ అధికారులు ఇంటిని కూల్చివేశారు.. ఇంట్లో ఉన్న వస్తువులను బయటపడేసి అందరూ చూస్తుండగానే ఇంటిని కూల్చేశారు.. గోడకు మరమ్మతులు చేశామని శ్రావణి, ఆమె కుటుంబ సభ్యులు ఎంత మొత్తుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదు.. ఇంటిని కూల్చివేయడంతో పక్కనే ఉన్న కమ్యూనిటీ హాల్‌లో మహిళా క్రికెటర్ కుటుంబం తలదాచుకుంటోంది.
తన అమ్మ తరపు బంధువులు శ్రీనివాస్ కళ్యాణ్, జానకిరామ్ స్థలంపై కన్నేశారని.. వారిద్దరికీ అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని.. రాజకీయ అండతోనే తమ ఇంటిని కూల్చివేశారని శ్రావణి తీవ్ర ఆవేదనతో చెప్పారు.. 35 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని పేర్కొంది.. జీహెచ్‌ఎంసీ అధికారులపై తుకారాంగేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో శ్రావణి తండ్రి తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు.. ఇంటిని అధికారులు కూల్చివేయడంతో తట్టుకోలేకపోయారు.. ఘటనా స్థలం వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించడంతో భయాందోన చెందిన మల్లేష్ స్పృహ తప్పి పడిపోయారు.. శ్రావణితోపాటు అక్కడున్నవారు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం మల్లేష్‌కు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు..
అటు ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు.. మహిళా క్రికెటర్ ఇంటిని కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. క్రికెటర్ శ్రావణి దళిత అమ్మాయి కాబట్టే వివక్ష చూపుతున్నారని అన్నారు. కూల్చిన ఇంటిని పరిశీలించిన వీహెచ్.. మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటిని ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు.. శ్రావణికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. రేపు కూల్చిన ఇంటి వద్దనే ధర్నా చేస్తానన్నారు వి.హనుమంతరావు. వున్న ఇల్లు కూల్చివేయడంతో ఇప్పుడు శ్రావణి కుటుంబం రోడ్డున పడింది.. ఈనెల 15 నుంచి పుదుచ్చేరిలో జరిగే టీ20 టోర్నమెంట్‌లో శ్రావణి పాల్గొనాల్సి ఉంది.. అయితే, అధికారులు ఇంటిని కూల్చివేయడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.. టోర్నమెంట్‌కు వెళ్లాలా, లేక ఇంటి కోపం పోరాడాలో అర్థంకాక తీవ్ర ఆవేదన చెందుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com