గ్రేటర్ మేయర్ పీఠంపై కమలనాథుల గురి

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో కమలనాథులు దూసుకుపోతున్నారు. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు సర్వశక్తులొడ్డుతూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే బల్దియా ప్రచార పోరులో బీజేపీ అగ్రనేతలు పాల్గొనగా.. శనివారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహిస్తారు. అలాగే ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రచారంలో పాల్గొంటారు.
ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారానికి గడువు ముగియనుంది. దీంతో కమలం టీం మరింత దూకుడు పెంచింది. శనివారం యూపీ సీఎం యోగి... సౌత్ ఇండియా మాల్ చౌరస్తా నుంచి ఉషాముళ్లపూడి వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అలాగే జీడిమెట్ల, ఆల్విన్ కాలనీ ఎక్స్‌రోడ్డ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శాలిబండలోని అల్కథియేటర్ గ్రౌండ్‌లోని బహిరంగ సభలో సీఎం యోగి ప్రసంగిస్తారు.
ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. గ్రేటర్ ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చేరుకుని.. మధ్యాహ్నం 12 గంటలకు వారాసిగూడ చౌరస్తా నుంచి సీతాఫల్ మండి వరకు సాగే రోడ్‌షోలో పాల్గొంటారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్ ఎన్నికలపై ముఖ్య నేతలతో చర్చిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com