Godavari : గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో.. బిక్కుబిక్కుమంటున్న పోలవరం ముంపు గ్రామాలు..

Godavari : గోదావరి వరద అన్ని రికార్డులను దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాత్రికి 75 అడుగులు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భద్రాచలానికి పైన తెలంగాణలో గోదావరిపై ఉన్న అన్ని రికార్డులను ప్రస్తుత వరద అధిగమించింది. ఈ కారణంగానే ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి.
వేలాదిమంది ఇళ్లను వదిలిపెట్టాల్సి వచ్చింది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. లంక గ్రామాలైతే కనీసం వారం పాటు వరదలోనే ఉండే పరిస్ధితి కనిపిస్తోంది.
భద్రాచలం వద్ద నీటి మట్టం 70 అడుగులకు చేరితే కుక్కునూరు, వేలేరుపాడు జల సమాధే అంటున్నారు అధికారులు. పోలవరం ముంపు మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక, చింతూరు మండలాల్లోని అనేక గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. 12,694 కుటుంబాలకు చెందిన 36 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
పదుల సంఖ్యలో గ్రామాలు పూర్తి జల దిగ్బంధంలో ఉన్నాయి. దీంతో ఎటునుంచి వరద వచ్చిపడుతుందోనని ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
కుక్కునూరు-భద్రాచలం మధ్య రహదారి 12 చోట్ల మునిగిపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కుక్కునూరు-అశ్వారావుపేట రహదారి నిన్న రాత్రి నీట మునగడంతో తెలంగాణ వైపు సంబంధాలు తెగిపోయాయి. కుక్కునూరు గ్రామానికి మూడు వైపులా నీరు వచ్చి చేరుతుండటంతో ప్రస్తుతం ఈ ఊరు జలదిగ్బంధంలో ఉంది. కుక్కునూరు మండలంలో 20 గ్రామాలను వరద ముంచెత్తింది. మరో 30 గ్రామాలకు ఒకదానితో మరోదానికి సంబంధాలు తెగిపోయాయి.
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రం సహా 30 గ్రామాలను వరద చుట్టుముట్టింది. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 70 అడుగులు చేరుకుంటే కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు జల సమాధి కానున్నాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నుంచే ఏకంగా 6వేల మందిని రాత్రికి రాత్రి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కూనవరం మండలంలో వరద బాధితులు కట్టుబట్టలతో మిగిలారు.
ఎటపాక మండలంలోని పలు గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. గోదావరి వరద పోటెత్తడంతో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కేంద్ర జలసంఘం చెబుతున్న దాని ప్రకారం.. భద్రాచలం, కూనవరం, చింతూరు, ఏటూరు నాగారం, దుమ్ముగూడెం, ధవళేశ్వరం వద్ద అతి భారీ ప్రవాహం కొనసాగనుంది.
గోదావరి వరద ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో 554 గ్రామాలపై ప్రభావం చూపనుంది. కోనసీమ జిల్లాలో 20 మండలాలు, తూర్పు గోదావరిలో 8, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరిలో 4, ఏలూరు జిల్లాలో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశముంది.
గోదావరికి మరింత వరద వచ్చే ప్రమాదం పొంచి ఉండడంతో కోనసీమ లంకవాసులు ఆందోళన చెందుతున్నారు. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, కె.గంగవరం, ఐ.పోలవరం మండలాల్లోని పలుచోట్ల ఇళ్లలోకి నీరుచేరింది. కనీసం 73వేల మందికి పైగా వరద బారిన పడ్డారు. వరద ఉధృతి మరింత పెరిగితే కాట్రేనికోన, కపిలేశ్వరపురం, ఆత్రేయపురం మండలాల్లోని పలు గ్రామాల్లోని ఇళ్లలోకి నీరు చేరే అవకాశముంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com