RAINS: గోదావరి మహోగ్రరూపం

RAINS: గోదావరి మహోగ్రరూపం
X
ఎగువన కురుస్తున్న వర్షాలకు పోటెత్తుతున్న వరద... రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, తాలిపేరు ఉపనదుల నుంచి గోదావరికి వరద పోటెత్తుతోంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి 48 అడుగులను దాటింది. సాయంత్రం 6 గంటలకు 49.10 అడుగులకు చేరుకుంది. మంగళవారం ఉదయానికి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 11,82,547 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ఉరకలెత్తుతోంది. ఎగువన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద నిలకడగా కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు 9.54 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 85 గేట్ల ద్వారా దిగువకు వెళ్తోంది.


ఇంద్రావతి నుంచి గోదావరిలో కలిసిన అనంతరం తుపాకుల గూడెం సమ్మక్క బ్యారేజీ వద్ద 10.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వెళ్తోంది. దుమ్ముగూడెం సీతమ్మసాగర్‌ ఆనకట్ట వద్ద 11.86 లక్షల క్యూసెక్కులు నమోదవుతోంది. గోదావరి పోటెత్తడంతో ఇప్పటికే చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం పట్టణంలోనూ వరద ప్రభావం ప్రారంభమైంది. గోదావరికి 53 అడుగుల వరద వస్తే చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని 13 గ్రామాలకు, భద్రాచలం పట్టణంలో కొంత ప్రాంతానికి ముంపు ప్రభావం ఉండనుంది. చర్ల మండలంలో దాదుపేట, కొత్తపల్లి, సుబ్బంపేట, దుమ్ముగూడెం మండలంలో ఎల్‌ఎన్‌ రావు పేట, ప్రగళ్లపల్లి, సింగవరం, ఎస్‌ కొత్తగూడెం, కన్నాపురం, గంగోలు, కె.రేగుబల్లి, తూరుబాక, డబ్ల్యూ.రేగుబల్లి, బైరాగులపాడు గ్రామాలపై యంత్రాంగం దృష్టి సారించింది. భద్రాద్రి జిల్లా యంత్రాంగం వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి.

కృష్ణానదిలో ఆలమట్టి నుంచి శ్రీశైలం జలాశయం వరకు అన్నిచోట్లా దాదాపు 1.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. నారాయణపూర్‌ నుంచి వస్తున్న వరదను అలాగే వదిలేస్తున్నారు. జూరాల నుంచి స్పిల్‌వే గేట్లు, విద్యుదుత్పత్తి అనంతరం భారీ వరదను వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి 1.74 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి. మరోవైపు తుంగభద్ర 90 టీఎంసీల చేరువలో ఉంది. మంగళవారం సాయంత్రానికి ఈ ప్రాజెక్టు నిండనుంది. అనంతరం తుంగభద్ర నది ద్వారా శ్రీశైలానికి నీటిని వదలనున్నారు.

Tags

Next Story