మంచి మాంసం విదేశాలకు వెళుతోంది.. కొనేముందు జాగ్రత్త: జాతీయ మాంసం పరిశోధనా డైరెక్టర్

సండే వచ్చిందంటే సంచి పట్టుకుని బయల్దేరతారు. మాంసం దుకాణం ముందు పెద్ద క్యూ ఉన్న గంటల తరబడి నిలబడి నిలబడి మాంసం కొనుగోలు చేస్తుంటారు నాన్ వెజ్ ప్రియులు. అంత కష్టపడి ఇష్టంగా తెచ్చుకున్న మాంసం మంచిదో కాదో ఒకసారి ఆలోచించి తీసుకోమంటున్నారు జాతీయ మాంసం పరిశోధనా కేంద్ర డైరెక్టర్ సుఖదేవ్ బర్బుద్దే. తెలుగు రాష్ట్రాల వ్యాపారులు ఆరోగ్యకరమైన మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
ఇక్కడ దుకాణాల్లో మాత్రం నాణ్యమైన మాంసాన్ని విక్రయించడం లేదని ఆయన అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం మంది మాంసాహారులు.. అందువల్ల నాణ్యత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సుఖదేవ్ అన్నారు. మాంసాహారులపై, మాంసం విక్రయాలపై సంస్థ ఇటీవల అధ్యయనం చేసింది. మాంసం విక్రయదారులకు నాణ్యత ప్రమాణాలపై శిక్షణ ఇచ్చి వారికి అవసరమైన సామాగ్రిని ఉచితంగా అందిస్తోంది.
మాంసాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేవి ఐదు రాష్ట్రాలు.. అవి ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి మాంసం ఎగుమతులు ఆశించిన స్థాయిలో జరగట్లేదు. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో కిలో మాంసం ధర 4.50 నుంచి 5 డాలర్లలోపే ఉంటుంది. ఇక ఇక్కడ మాంసం ధర వచ్చేసి రూ.700-800 దాకా వసూలు చేస్తున్నారు.
అంటే 10-11 డాలర్తు ఖర్చవుతుంది. ఇదే మాంసాన్ని శుద్ధి చేసి విదేశాలకు ప్యాకింగ్ చేయాలంటే మరో 2 డాలర్ల వరకు ఖర్చవుతుంది. అంటే సగటున కిలోకు 12-13 డాలర్లు వస్తేనే తెలుగు రాష్ట్రాల నుంచి ఎగుమతి సాధ్యం అవుతుంది. అంత ధర లేనందున ఇక్కడ నుంచి ఎగుమతులు పెరగడం లేదు అని ఆయన అన్నారు.
మాంసం కొనుగోలులో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి.. గొర్రె, మేక లేదా కోడిని కోసిన 3 గంటల్లోనే వండాలి. అలా వండకపోతే బ్యాక్టీరియా చేరి కుళ్లడం ప్రారంభమవుతుంది. వెంటనే వండడానికి వీలవకపోతే 0-4 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఫ్రిజ్‌లో భద్రపరచాలి. 24 గంటల తర్వాత అయితే మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాలి. కానీ చాలా దుకాణాల్లో తెల్లవారు జామున మాంసం కోసి పగలంతా అమ్ముతుంటారు. మాంసాన్ని వేలాడదీసి అమ్మడం కూడా అనారోగ్యకరం. అవి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సారి మాంసం కొనుగోలు చేసేటప్పుడు మీ బాధ్యతగా దుకాణదారుడిని అడగండి. కస్టమర్స్ అడుగుతుంటే వ్యాపారులు కూడా జాగ్రత్త వహిస్తుంటారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com