హెల్మెట్‌లో ఏసీ.. కూల్‌గా డ్యూటీ

మండిపోయే ఎండలు అయినా ట్రాఫిక్ పోలీస్ తన డ్యూటీ తాను చేయాల్సిందే.. ఇంట్లో ఉంటే ఏసీ, మరి బయట భరించలేని ఉక్క. అయినా తప్పని డ్యూటీ.. అందుకే తెలంగాణ ప్రభుత్వం వారి కోసం హెల్మెట్‌లోనే ఏసీ ఉండే సౌకర్యవంతమైన పరికరాన్ని అమర్చి ట్రాఫిక్ పోలీసులకు అందించనుంది. ఇటీవల వాటిని ప్రయోగాత్మకంగా కొందరు ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌కి అందించారు. ముఖ్యంగా ట్రాఫిక్ లో విధులు నిర్వహించే కానిస్టేబుళ్ల కోసం తెలంగాణ పోలీస్ శాఖ తాజాగా ఈ ఏసీ హెల్మెట్ ను సిద్ధం చేసింది.
వారం రోజుల క్రితం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఎల్‌టీనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కొంతమంది ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్‌లు ఇచ్చారు. ప్రస్తుతం వారి పనితీరుపై విచారణ జరుగుతోంది. త్వరలోనే వీటిని అందరికీ అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఈ ఏసీ హెల్మెట్‌ను అరగంట చార్జ్ చేస్తే మూడు గంటలు పనిచేస్తుంది. ఈ హెల్మెట్‌లు ఎండ ప్రభావం నుంచి కొంత ఉపశమనం కలిగిస్తాయని, చల్లటి గాలిని అందిస్తాయని తయారీదారులు వివరిస్తున్నారు.
ఈ ఏసీ హెల్మెట్ ట్రాఫిక్ పోలీసులను వడదెబ్బ, వేడిమి నుంచి కాపాడుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని అందించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది.పోలీసు శాఖ కానిస్టేబుళ్ల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటోంది. గతంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు కూలింగ్ గ్లాసులు అందించిన పోలీసు శాఖ త్వరలో అందరికీ ఏసీ హెల్మెట్లను అందించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com