BJP: బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరో..?

భారతీయ జనతా పార్టీ తెలంగాణ నూతన అధ్యక్షుడి నియామకం విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తెలంగాణ కొత్త అధ్యక్షుడిగా దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని నియమించాలని రాజాసింగ్ బీజేపీ అధిష్టానాన్ని అభ్యర్థించారు. పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధ్యక్షుడి ఎంపిక జరగాలని.. 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోవాలని రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్‌ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమిస్తారంటూ ప్రచారం జరుగుతున్న వేళ రాజాసింగ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీఆర్‌ఎస్‌లో ఉన్న ఈటల రాజేందర్ 2021లో బీజేపీలో చేరారు. దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని నియమించాలని రాజాసింగ్ డిమాండ్ చేయడంతో ఈటల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
ధర్మపురి అర్వింద్‌కేనా..?
లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన వ్యక్తుల్లో ఒకరికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనుకుంటే ధర్మపురి అర్వింద్‌కు ఇవ్వాలని రాజాసింగ్ కోరుతున్నారు. అర్వింద్ 2019 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. హిందుత్వ భావజాలం కలిగిన అర్వింద్‌కు రాజాసింగ్ మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం తెలంగాణ శాఖ కొత్త అధ్యక్షుడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచిచూడాల్సి ఉంది.
ఎంపీల్లోనే ఒకరు...
ఇప్పటివరకూ అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డిని కేంద్రమంత్రివర్గంలో తీసుకోవడంతో తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఇటీవల ఆ పార్టీ నుంచి గెలిచిన 8మంది ఎంపీల్లో ఇద్దరిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు. మిగిలిన ఆరుగురు ఎంపీల్లో నలుగురు పేర్లు రాష్ట్ర అధ్యక్షుడి పదవి రేసులో వినిపిస్తున్నాయి. మెదక్ ఎంపీ రఘునందన్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అధ్యక్షుడి రేసులో ఉన్నారు. కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఈటలకు బీజేపీ తెలంగాణ శాఖ బాధ్యతలు అప్పగిస్తారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com