REVANTH: ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఓ భావోద్వేగం

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు కేవలం ఉపాధి అవకాశాలు మాత్రమే కాదని, యువత జీవితాలతో ముడిపడ్డ ఒక భావోద్వేగమని ముఖ్యమంత్రి Revanth Reddy స్పష్టం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్య విధానాల కారణంగా ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన యువత, మార్పు కోసం పోరాడి ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఉద్యోగాల కల నెరవేరాలంటే పాలకుల నిబద్ధత ఎంత ముఖ్యమో, తమ ప్రభుత్వం ఆచరణలో చూపిస్తోందని సీఎం పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–3 ఉద్యోగాలకు ఎంపికైన 1,370 మంది అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ సందర్భంగా శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పోటీ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలు, పేపర్ లీకులు, పదే పదే పరీక్షలు రద్దు కావడం వంటి ఘటనలను ఉదహరిస్తూ, అవన్నీ యువత భవిష్యత్తుతో ఆడుకున్న చర్యలేనని మండిపడ్డారు.
గత ప్రభుత్వం గ్రూప్–1 పరీక్షలను సకాలంలో నిర్వహించలేకపోయిందని, 14 సంవత్సరాల పాటు అభ్యర్థులను నిరీక్షణలో ఉంచిందని సీఎం ఆరోపించారు. పోటీ పరీక్షలు నిర్వహించకపోవడం ఒక బాధ్యతారాహిత్యమైతే, నిర్వహించిన పరీక్షల్లో పేపర్లు లీక్ కావడం మరో పెద్ద నిర్లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కారణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బతిందని, ప్రభుత్వ వ్యవస్థలపై యువత నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం సొంత లాభాలకే పరిమితమై, యువత, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని సీఎం విమర్శించారు. కుటుంబ ప్రయోజనాలు, పార్టీ రాజకీయాలు, అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పాలన సాగిందని ఆరోపించారు. వారి ఉద్యోగాలు పోతేనే కొత్త ఉద్యోగాలు వస్తాయనే భావనతోనే యువత ఉద్యమించి, ఈ ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిందని ఆయన గుర్తుచేశారు.
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని సీఎం తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అయితే, వాటిని సద్వినియోగం చేసుకోవడం యువత జీవితాలేనని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం జీతం తీసుకోవడం మాత్రమే కాదని, అది ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక భావోద్వేగమని స్పష్టం చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశ్వసనీయతను పునరుద్ధరించేందుకు యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని సంస్కరించామని సీఎం తెలిపారు. గ్రూప్–1 నియామక పత్రాల పంపిణీ సమయంలో కూడా కొందరు కోర్టులను ఆశ్రయించి కుట్రలు చేశారని ఆరోపించారు. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని, పారదర్శకంగా నియామక ప్రక్రియను పూర్తి చేశామని చెప్పారు.
విద్యా వ్యవస్థపై కూడా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ విద్య అందుతున్నప్పటికీ, నాణ్యమైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజల్లో ప్రైవేటు పాఠశాలలపై విశ్వాసం పెరిగిందని అన్నారు. లక్షల మంది ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నా, అందరికీ ఉద్యోగాలు దక్కకపోవడానికి కారణం నైపుణ్యాల లోపమేనని చెప్పారు. జాబ్ మార్కెట్‌లో అవకాశాలు ఉన్నప్పటికీ, అవసరమైన స్కిల్స్ లేక యువత వాటిని అందుకోలేకపోతోందని వివరించారు.నైపుణ్యాభివృద్ధిపై యువత ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఒకప్పుడు పేదరికాన్ని నిర్మూలించేందుకు భూములు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు ఇవ్వడానికి భూములు లేవని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇవ్వగలిగేది నాణ్యమైన విద్య మాత్రమేనని స్పష్టం చేశారు. విద్య ఒక్కటే పేదరికాన్ని పోగొడుతుందని, విద్యతోనే గౌరవం, అవకాశాలు వస్తాయని చెప్పారు. భవిష్యత్తుపై కూడా సీఎం ఆశావహ దృక్పథం వ్యక్తం చేశారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. ఇందుకోసం లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చి, ప్రపంచంతో పోటీ పడే విధంగా యువతను తీర్చిదిద్దే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. పరిశ్రమలు, సాంకేతికత, నైపుణ్యాలు – ఈ మూడింటి సమన్వయంతోనే తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలమని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

