TS Governor Tamilisai: అసెంబ్లీలో గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

పాలకులకు, ప్రజలకు మధ్య ఇనుప కంచెలు తొలగిపోయాయని... పౌరహక్కులకు, ప్రజాస్వామ్యపాలనకు నాంది పలికేలా రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె...తొలి అడుగులోనే సంక్షేమానికి తమ ప్రభుత్వం నాంది పలికిందని తెలిపారు. ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామన్న తమిళిసై...తొమ్మిదిన్నరేళ్లలో విధ్వంసానికి గురైన వ్యవస్థల పునరుద్ధరణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.
ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో ప్రసంగం ప్రారంభించిన ఆమె.. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. నియంతృత్వ పోకడల నుంచి రాష్ట్రానికి విముక్తి లభించిందని గవర్నర్ పేర్కొన్నారు. ఎన్నో ఆశలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నామని... రైతులు, యువత, మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న గవర్నర్... తొలి అడుగులోనే సంక్షేమానికి నాంది పలికిందని గుర్తు చేశారు.
ఏడాది లోపు రాష్ట్రంలోని 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. త్వరలోనే మెగా డీఎస్సీని ప్రకటిస్తామన్నారు. భూమాత పోర్టల్ అత్యంత పారదర్శకంగా ఉంటుందని.. అడ్డుగోడలు, అద్ధాల మేడలు పటాపంచలయ్యాయంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్ర నిధుల దుర్వినియోగం, దుబారా ఎక్కడ జరిగిందో కనిపెట్టే పనిలో నిమగ్నమైనట్టు గవర్నర్ తెలిపారు. త్వరలోనే అన్ని శాఖలపై శ్వేతపత్రం విడుదలచేస్తామని స్పష్టం చేశారు. ప్రజలపై భారం మోపకుండా మెరుగైన పాలన అందిస్తామన్నారు గవర్నర్.
నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడిన TSPSC ప్రక్షాళన ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించిందని గవర్నర్ తెలిపారు. 6 నెలల్లో మెగా DSC, ఏడాదిలోపు 2లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. భూసమస్యల సమగ్ర పరిష్కారానికి ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తెస్తామన్నారు. అమరుల కుటుంబాలకు ఇంటి స్థలం, అసైన్డ్, పోడుభూములకు పట్టాల పంపిణీ చేపడతామన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, మత్తు పదార్థం అనే మాట వినబడేందుకు వీలులేదన్నారు. తొమ్మిదిన్నేరేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలు విధ్వంసానికి గురయ్యాయని గవర్నర్ తెలిపారు.
తమ ప్రభుత్వం మాటల కంటే... చేతలనే ఎక్కువగా నమ్ముకుందని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడిన అమరవీరులు, గుర్తింపబడని పోరాట యోధులకు అంజలి ఘటిస్తూ...తెలంగాణ సంపూర్ణ అభివృద్ధికి పునరంకిత మవుదామంటూ ప్రసంగాన్ని ముగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com