Tamilisai Soundararajan : అహంకారిని కాను, శక్తివంతురాలిని అంటూ గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు

Tamilisai Soundararajan : అహంకారిని కాను, శక్తివంతురాలిని అంటూ గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు
Tamilisai Soundararajan : తాను స్నేహపూర్వక వ్యక్తినని, స్నేహాన్ని బలహీనతగా భ్రమ పడొద్దంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Tamilisai Soundararajan : తాను అహంకారిని కాను... శక్తివంతురాలిని అంటూ గవర్నర్‌ తమిళిసై చేసిన వ్యాఖ్యలతో.. రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య దూరం మరింత పెరిగిందనేది స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పైగా ప్రజా దర్భార్‌ పేరుతో ప్రజలతో భేటీ అవుతున్నానని, వచ్చే నెల నుంచి రెగ్యులర్‌గా ప్రజా దర్భార్‌లు ఉంటాయని స్ట్రాంగ్ వాయిస్‌తో చెప్పుకొచ్చారు గవర్నర్ తమిళిసై. రాజ్‌భవన్‌లో మీ సోదరి కూర్చుని ఉందని గుర్తు పెట్టుకోండంటూ కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్‌భవన్‌లో తెలంగాణ సోదరి కూర్చుని ఉందని గుర్తుంచుకోండంటూ తన ఉద్దేశాన్ని బయటపెట్టారు.

రాజ్‌భవన్‌లో స్నేహపూర్వక గవర్నర్‌ ఉన్నారని చెబుతున్నానంటూ ఓ సిగ్నల్ పంపించారు తమిళిసై. రాజ్‌భవన్‌లో గ్రీవెన్స్‌ బాక్సులను ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ ప్రజల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయన్నారు గవర్నర్. ఈ విజ్ఞప్తులన్నింటినీ రాజ్‌భవన్‌ బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని, అవసరం ఉన్నవారికి, పేదలకు రాజ్‌భవన్‌ నుంచి ఉడతా భక్తి సాయాన్ని అందుతోందంటూ చెప్పుకొచ్చారు. సోదర సోదరీమణులు, పెద్దలు, చిన్నలందరికీ రాజ్‌భవన్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఎప్పుడు ప్రజల వెన్నంటే ఉంటున్నామని ఏ గవర్నర్‌ చేయని రీతిలో సరికొత్త ప్రకటన చేశారు.

తాను స్నేహపూర్వక వ్యక్తినని, స్నేహాన్ని బలహీనతగా భ్రమ పడొద్దంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌ చాలా దృఢంగా ఉందని, తాను చాలా శక్తివంతురాలినని ప్రకటించారు. ముఖ్యంగా ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్ సహా మంత్రులెవరూ హాజరుకాకపోవడంతోనే గవర్నర్ తమిళిసై ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతి ఏటా సంప్రదాయంగా వస్తున్న ఉగాది వేడుకలకు అధికార, ప్రతిపక్షాలు రాజ్‌భవన్‌కు రావడం ఆనవాయితీ.

ప్రొటోకాల్ ప్రకారం రావాల్సిన అవసరం లేకపోయినా.. ఎన్నాళ్లుగానో ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. కాని, శుభకృత్ నామ సంవత్సరంలో మాత్రం అలా జరగలేదు. సీఎం కేసీఆర్‌ సహా మంత్రులు ఎవరూ హాజరు కాలేదు. చివరికి ప్రొటోకాల్ ప్రకారం రావాల్సిన సీఎస్‌, డీజీపీ కూడా రాకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు రాజ్‌భవన్‌లో ఉగాది ఫ్లెక్సీలపై కేసీఆర్‌ ఫోటో కూడా ఎక్కడా కనిపించలేదని చర్చించుకున్నారు.

రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌కు మధ్య దూరం పెరగడానికి.. పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ సీఎంవో పంపిన ఫైలును గవర్నర్‌ పక్కన పెట్టడమేనని చెప్పుకుంటున్నారు. అప్పటి నుంచే గవర్నర్, సీఎంవో మధ్య విభేదాలు తలెత్తాయని ఓ ప్రచారం నడుస్తోంది. పైగా రాజ్‌భవన్‌లో ప్రజా దర్భార్‌ ఏర్పాటు చేయడం, గ్రీవెన్స్‌ బాక్సులు పెట్టడంపైనా సీఎం కేసీఆర్‌ ఆగ్రహంగా ఉన్నారని టీఆర్‌ఎస్‌లోని ఓ వర్గం చెబుతోంది. అందుకే, రాజ్‌భవన్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలకు సీఎం కేసీఆర్‌ హాజరు కాలేదని, బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకుండా నడిపారని విమర్శలు వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story