GROUP 1: "గ్రూప్-1లో ఎలాంటి అవకతవకలు జరగలేదు"

తెలంగాణ గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టులో గురువారం కూడా వాదనలు కొనసాగాయి. టీజీపీఎస్సీ తరపున న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషనర్ల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని.. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్యలో ఎలాంటి తేడా లేదన్నారు. కోఠిలోని ఓ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన వారే ఎక్కువ మంది ఎంపిక అయ్యారనేది అబద్దమని, అక్కడున్న 2 కేంద్రాల్లో 1500 మంది మహిళా అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాశారని, మహిళలకు కేటాయించడం కేవలం అక్కడున్న ఫెసిలిటీస్ ను దృష్టిలో పెట్టుకొని మాత్రమేనని కోర్టుకు స్పష్టం చేశారు. ఉద్యోగానికి ఎంపిక కాలేదని ఏవేవో అనుమానాలు పెట్టుకోవడం తప్ప పిటిషనర్స్ ఆరోపణల్లో నిజం లేదన్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం అభ్యర్థుల పట్ల కమిషన్ ఎలాంటి వివక్ష చూపించలేదని, వారు సమాధానం రాసిన అంశాలను బట్టి నిపుణులు మార్కులు వేశారని కోర్టుకు తెలిపారు. గ్రూప్ 1 మెయిన్స్‌లో తెలుగు మీడియం అభ్యర్థుల సమాధాన పత్రాలు సరిగ్గా వాల్యుయేషన్ చేయలేదని, కోఠిలోని ఓ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన అభ్యర్థులే ఎక్కువమంది ఎంపిక అయ్యారని కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్స్ దాఖలు చేశారు. మెయిన్స్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి, మళ్ళీ పరీక్ష నిర్వహించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com