TSPSC: గ్రూప్ వన్ రద్దుపై ఆగ్రహ జ్వాలలు

గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన వేళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరు మరోసారి రాజకీయ అగ్గి రాజేసింది. పేపర్ లీక్‌తో లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారినా, TSPSC నిర్లక్ష్యంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జరపటంలో ఆంతర్యమేంటని విపక్షాలు ప్రశ్నించాయి. ప్రభుత్వం, పబ్లిక్ కమిషన్ తీరును నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరుద్యోగ యువతీయువకులు ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, వెంటనే TSPSC బోర్డును రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు..
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండోసారి రద్దుకావడంపై రాజకీయపార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. TSPSC ఛైర్మన్, సభ్యులను తొలగించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి....... పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు.. నష్టపరిహారం ఇవ్వాలని నిలదీస్తున్నారు. గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష రెండోసారి నిర్వహణ లోపాల వల్లే హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేసిందని NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు హర్షవర్దన్, రియాజ్ ఆరోపించారు. రెండుసార్లు పరీక్షలు నిర్వహించినా........ లోపభూయిస్టంగా జరపారని విమర్శించారు. వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేయాలని హైకోర్టు చెప్పిందని ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండోసారి రద్దుకావడంTSPSC అసమర్థత, నిర్లక్షానికి నిదర్శనమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తక్షణమే సర్వీస్‌కమిషన్ చైర్మన్, సభ్యులందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు. తొలిసారి పేపర్ లీకైనా నిస్సిగ్గుగా అదే బోర్డును కొనసాగించారని అయినా రెండోసారి పరీక్ష నిర్వహణలో బయోమెట్రిక్ నమోదు చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడడమేమిటని ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న భారాసా ప్రభుత్వాన్ని గద్దె దింపాలని.. తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం డిమాండ్ చేశారు. మినీ డీఎస్సీ కాదు మెగా డీఎస్సీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో డీఎస్సీ నిరుద్యోగులు నిర్వహించిన సమావేశంలో కోదండరాం పాల్గొన్నారు. విద్యార్థులు వ్యయ ప్రయాసలకు ఓర్చి పరీక్షలకు సిద్ధమవుతున్నారని.. వారి ఖర్చులను ఎవరు భరిస్తారని కోదండరాం ప్రశ్నించారు. ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై.. డివిజన్‌బెంచ్‌లో అప్పీల్‌చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు న్యాయనిపుణులతో సమావేశమై సోమవారం అప్పీలు దాఖలు చేయనున్నట్లు తెలిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com