GROUP 1: ఆశలను చిదిమేసిన ఒక్క నిమిషం

GROUP 1: ఆశలను చిదిమేసిన ఒక్క నిమిషం
X
గ్రూప్ 1 మెయిన్స్‌కు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు.. అనుమతించాలని కన్నీరు

ఒక్క నిమిషం నిబంధన ఉద్యోగార్థుల కలను చిదిమేసింది. ప్రభుత్వ అధికారులుగా స్థిరపడాలన్న వారి ఆశలపై నీళ్లు చల్లింది. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల్లో నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని అధికారులు అనుమతించలేదు. మధ్యాహ్నం 1.30 గంటలకు అన్నీ పరీక్షా కేంద్రాల గేట్లను అధికారులు మూసేశారు. దీంతో తమను పరీక్షకు అనుమతించాలని కన్నీటితో వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఓ పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థి రోదిస్తూ తనను లోపలికి పంపించాలని గేటు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా తొలి రోజు కొన్ని చోట్ల గుండెలు పిండేసే దృశ్యాలు కనిపించాయి.

గోడ దూకి పరీక్ష కేంద్రంలోకి..

పలువురు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్నారు. తమను అనుమతించాలంటూ కొందరు అభ్యర్థులు కోరినా అధికారులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ PG కాలేజ్ పరీక్షా కేంద్రానికి 2నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఓ అభ్యర్థి.. గోడ దూకి లోపలకి వెళ్లేందుకు యత్నించాడు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

తొలిరోజు ముగిసిన మెయిన్స్ పరీక్ష

తొలిరోజు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష కొనసాగింది. మరోవైపు జీవో 29ను రద్దు చేయాలని, మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్లు న్యాయస్థానం కొట్టివేసింది. ఈనెల 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. కాగా, 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి TGPSC పరీక్షలు నిర్వహిస్తోంది.

సుప్రీం తీర్పు శుభపరిణామం: మహేష్ కుమార్‌ గౌడ్

గ్రూప్‌-1 పరీక్షలు వాయిదా వేయాలంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు శుభ పరిణామమని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘బీసీ బిడ్డగా మరోసారి హామీ ఇస్తున్నా. జీవో 29తో రిజర్వేషన్ల అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగదు’’ అని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

Tags

Next Story