BRS: బీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న అసంతృప్తి

BRS: బీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న అసంతృప్తి
లోక్‌సభ సన్నాహక సమావేశంలో వర్గపోరు.... మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం

బీఆర్‌ఎస్‌ చేవెళ్ల లోక్ సభ సన్నాహక సమావేశంలో వర్గపోరు బయట పడింది. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, వారి అనుచరుల మధ్య.... వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమావేశంలో నేతల ప్రసంగాలు కొనసాగుతున్న సమయంలో..ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడేందుకు సిద్దమవగా అభ్యంతరం చెప్పిన రోహిత్ రెడ్డి వర్గీయులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే మహేందర్ రెడ్డి వర్గీయులు పోటీ నినాదాలు చేశారు. ఇరువర్గాల పరస్పర నినాదాలతో.... భేటీలో వాతావరణం వేడెక్కింది. ఇదే సమయంలో వేదికపై మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి మధ్య మాటకు మాట పెరిగింది. ఈ దశలో జోక్యం చేసుకున్న మాజీమంత్రి హరీశ్ రావు, ఇతర నేతలు వారికి సర్దిచెప్పి భోజన విరామం ప్రకటించారు. మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డితో విరామ సమయంలో ప్రత్యేకంగా సమావేశమైన హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి వారికి నచ్చజెప్పారు. తర్వాత సమావేశం కొనసాగగా కార్యకర్తలు ఆవేశాలకు లోను కావద్దని, ఎవరిపై విమర్శలు చేయకుండా అభిప్రాయాలు చెప్పాలని హరీశ్ రావు సూచించారు.


మరోవైపు రైతుబంధు సొమ్ము సకాలంలో రైతుల ఖాతాల్లో జమచేయకుండా రేవంత్ రెడ్డి సర్కార్ అన్నదాతలను అవమానించిందని బీఅర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఎకరాలోపు ఉన్న రైతులకు కూడా రైతుబంధు ఇవ్వలేదన్న ఆయన 15 వేలు ఇస్తామన్న వాళ్ళు. ఇపుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు ఓ నాటకమని మండిపడ్డారు. క్వింటా వడ్లకు 500 రూపాయలు బోనస్ , 2 లక్షలు రుణమాఫీ ఎంత వరుకు వచ్చిందని నిలదీశారు. కాంగ్రెస్ వచ్చాక నిత్యావసర ధరలు పెరిగిపోయాయన్న ఆయన ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించారు.

మరోవైపు గతంలో తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా, లబ్దిదారులకు అండగా నిలబడేలా నిరసన చేపట్టనున్నట్లు బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. పార్టీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ ఛార్జ్ లతో బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు లబ్ది కలిగిస్తున్న సంక్షేమ పథకాల రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని..ఈ విషయమై పార్టీ తరపున నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. భారాస ప్రభుత్వం ప్రారంభించిన అనేక పథకాలను కేవలం రాజకీయ అక్కసుతో ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసుకుంటూ వెళ్తోందని.. కేవలం రాజకీయ దురుద్దేశంతో పక్కన పెడుతోందని ఆక్షేపించారు. ఇప్పటికే గృహలక్ష్మి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చిందని..లబ్దిదారుల ఎంపిక పూర్తై అధికారిక పత్రాలు అందుకున్న వారి పరిస్థితి ఏంటో ప్రభుత్వం తెలపాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాలకు లబ్ది కలిగించే ఏ కార్యక్రమాన్ని వ్యతిరేకించినా, రద్దు చేసినా భారాస ప్రజల తరపున నిలబడుతుందని కేటీఆర్, హరీష్ తెలిపారు. గొర్రెల పంపిణీ, దళిత బందు కార్యక్రమాన్ని రద్దు చేయడం ఆయా సామాజిక వర్గాలకు తీరని అన్యాయం చేసినట్లేనని వారు వ్యాఖ్యానించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్ల మంజూరును ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story