ఏడాదికి రూ.58 లక్షల జీతం.. ఉద్యోగంలో చేరకముందే గుండెపోటుతో..

ఏడాదికి రూ.58 లక్షల జీతం.. ఉద్యోగంలో చేరకముందే గుండెపోటుతో..

Abhijit Reddy: ఎదిగిన బిడ్డపై అమ్మానాన్నలకు ఎన్నో ఆశలు. కొడుకు బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడితే సంతోషించే మొదటి వ్యక్తులు తల్లిదండ్రులే. కానీ వారి కలలను కల్లలు చేస్తూ వారి కళ్లముందే గుండెపోటుతో తనువు చాలించాడు. పట్టుమని 30 ఏళ్లు కూడా లేని అతడికి మృత్యువు గుండెపోటు రూపంలో ముంచుకొచ్చి తీసుకెళ్లిపోయింది. తక్షణ వైద్యం కోసం ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది.

తెలంగాణ రాష్ట్రవైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎండి కె. చంద్రశేఖర్ రెడ్డి పెద్ద కుమారుడు కట్టా అభిజిత్‌రెడ్డి (22) గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. వరంగల్ నిట్‌లో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన అభిజిత్.. సౌదీ అరేబియాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ సౌదీ అరామ్‌కోలో ఉద్యోగం సంపాదించుకున్నాడు.

ఏడాదికి రూ.58 లక్షల జీతం. వచ్చే నెలలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఆదివారం సాయింత్రం వాకింగ్‌కి వెళ్లొచ్చాడు. రాత్రి టీవీలో భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ చూశాడు. అర్థరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఛాతిలో నొప్పిగా ఉందన్నాడు. పక్కనే పడుకున్న తమ్ముడు కంగారుపడిపోయాడు. వెంటనే అమ్మానాన్నలను లేపి విషయం తెలియజేశాడు.

తండ్రి అభిజిత్ ఛాతిపై గట్టిగా నొక్కడం (కార్డియో పల్మనరీ రెసిపిటేషన్-సీపీఆర్) మొదలు పెట్టారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్న సమయంలోనే తెల్లవారుజామున మృతి చెందాడు. చెట్టంత కుమారుడు కళ్లముందే కుప్పకూలిపోవడంతో చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి కన్నీరు మున్నీరవుతున్నారు.

అభిజిత్ అకాల మరణంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story