Happy New Year : సీసీటీవీ నిఘా నీడలోనే వేడుకలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే సంగతులు
Hyderabad

Happy New Year 2023: ఇయర్ ఎండ్ పార్టీకి ఉరకలెత్తే ఉత్సాహంతో ఎదురుచూస్తున్న హైదరాబాదీలకు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఎటువంటి అసాంఘిక ఘటనలకూ అవకాశం దొరక్కుండా గట్టి భధ్రతా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పబ్ లకు, ఈవెంట్ ఆర్గనైజర్లకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పలు సూచనలతో కూడిన గైడ్ లైన్స్ ను విడుదల చేశారు. త్రీ స్టార్ హోటళ్ల దగ్గర నుంచి క్లబ్ లు, పబ్ లలో న్యూ ఇయర్ వేడుకలు సీసీటీవీ నిఘా నీడలోనే జరగాలని తీర్మానించారు.
ఈమేరకు వేడుకలు నిర్వహించనున్న అన్ని ప్రాంతాల్లోనూ సరిపడా సీసీటీవీలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా ఎంట్రీ, ఎక్సిట్ పాయింట్ లతో పాటూ పార్కింగ్ లోనూ కెమెరాలు ఏర్పాటూ చేయాల్సిందిగా సూచించారు. ఇకపోతే పబ్బుల్లో శబ్దం 45 డెసిబుల్స్ కు మించకూడని తెలిపారు. దుస్తుల దగ్గర నుంచి డాన్స్ ల వరకూ ఎక్కడ అసభ్యతకు తావు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
జంటలకు మాత్రమే ఏర్పాటు చేసిన పార్టీలకు మైనర్లను అనుమతించకూడదని గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ సూచనల ప్రకారం పరిమిత సమయంలోనే మద్యం సరఫరా చేయాలని తెలిపారు. ఇక మద్యం సేవించిన కస్టమర్ లకు క్యాబ్ లు, లేదా డ్రైవర్ లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పబ్ లదేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా 'డెసిగ్నేటెడ్ డ్రైవర్ ఫర్ ది డే' (పరిమిత, లేదా ఆ రోజుకు మద్యం సేవించకుండా తమ స్నేహితులను సురక్షితంగా ఇంటికి తీసుకుని వెళ్లగలిగే వ్యక్తి) కాన్సెప్ట్ ను తమ కస్టమర్లకు అర్ధమయ్యే విధంగా వివరించాలని సూచించారు.
ఇక డ్రగ్స్ వంటివి పార్టీల్లోకి జొరబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. 31వ తారీఖున లేట్ నైట్ పార్టీలు ఏర్పాటు చేయదలచుకున్న పబ్ లు, హోటళ్లు ముందస్తుగానే కమిషనర్ అనుమతికి ధరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com