ఆగని ఆన్‌లైన్ లోన్ యాప్ ఆగడాలు.. మరో యువకుడు ఆత్మహత్య

ఆన్‌లైన్ లోన్ యాప్ ఆగడాలు ఆగడం లేదు. రుణగ్రహీతల్ని యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. తక్షణమే రుణాలు చెల్లించలేని వాళ్ల బంధువులు, మిత్రులకు మెస్సేజ్‌లు పంపిస్తూ... రెచ్చిపోతున్నారు. పరువు పోయిందని మనస్తాపానికి గురైన కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులు తాళలేక చంద్రమోహన్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన చంద్రమోహన్.. లక్ష్మీనగర్‌లో ఓ గోదాములో సూపర్‌వైజర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య సరిత ఓ హాస్పిటల్‌లో పని చేస్తోంది. రెండు నెలల క్రితం ఆన్‌లైన్ యాప్ ద్వారా లక్ష రూపాయల లోన్ తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల తీవ్రమై.. వాయిదాలు చెల్లించలేకపోయాడు. దీంతో యాప్ నిర్వాహకులు వరుసగా ఫోన్‌లు చేస్తూ వేధింపులకు గురి చేశారు. చంద్రమోహన్ బంధువులు, స్నేహితులకు కూడా మెస్సేజ్‌లు పంపించారు. ఈ విషయం మీద.. నాలుగు రోజుల క్రితం చంద్రమోహన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయినా.. యాప్ నిర్వాహకుల వేధింపులు ఆగకపోవడంతో శనివారం ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు.
అటు.. ఆన్‌లైన్ లోన్ యాప్‌ల మూలాలు కనుక్కునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే కాల్ సెంటర్లు, యాప్‌ల నిర్వాహకుల్ని అరెస్టు చేశారు. చైనా కేంద్రంగా లోన్ యాప్ మాఫియా నడుస్తోందని గుర్తించారు. ఇటీవల అరెస్ట్ చేసిన లాంబో నుంచి కీలక సమాచారం రాబట్టారు. భారత్‌లో నాగరాజు అనే వ్యక్తిని ఇంఛార్జిగా నియమించుకుని.. యాప్‌లు నిర్వహించినట్టు గుర్తించారు. ఆన్‌లైన్ లోన్ యాప్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వలలో పడొద్దని పోలీసులు చెబుతున్నారు.
యాప్ ఆగడాల కేసులో పట్టుబడిన నిందితుల నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరిస్తూ... లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. యాప్‌ల ద్వారా 21వేల కోట్ల రూపాయలు దేశ సరిహద్దులు దాటినట్టు సీసీఎస్ అధికారులు గుర్తించారు. లాంబో ఆధ్వర్యంలో 30 లోన్ యాప్‌లు నడుస్తున్నట్టు తేల్చారు. లాంబో నుంచి చైనా లింకులు చేధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com