SDRF Funds: ఉత్తరం తెచ్చిన తంటా

SDRF Funds: ఉత్తరం తెచ్చిన తంటా
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌

ఎస్డీఆర్ఎఫ్ తెలంగాణ ప్రభుత్వానికి పంపిన ఓ లేఖ రాజకీయ రంగును పులుముకుంటుంది. ప్రతి పక్షాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అస్త్రాలు ఇచ్చినట్లయింది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ క్యాంప్, ముఖ్యంగా హరీశ్రావు ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు. ప్రభుత్వ ఖాతాలో రూ.1,345.15 కోట్ల ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధులు ఉన్నా వినియోగించకుండా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వరద ప్రభావంపై ఇప్పటివరకు కేంద్రానికి నివేదిక ఇవ్వకపోవడం దేనికి సంకేతమని నిలదీస్తున్నారు. దీంతో ప్రభుత్వం వరద సహయంలో ఇరుకున పడినట్లయింది. రాష్ర్టాన్ని ముంచెత్తిన వదరల కారణంగా లక్షలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయి, తినడానికి తిండిలేక, నిలువ నీడ లేక బాధితులు అల్లాడిపోతుంటే.. వారికి తక్షణ సాయం అందించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండిపోయింది. పరిహారం ప్రకటనలకే తప్ప ఆచరణలో కనిపించడం లేదు. కేంద్రాన్ని సాయం అడుగుతున్నామని, రాగానే అందిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని కేంద్రం బట్టబయలు చేసిందంటూ ప్రచారం చేస్తున్నారు.

ఇంతకు ఆ లేఖలో ఏముంది?

తెలంగాణలో వరదల వల్ల సుమారు రూ.5,348 కోట్ల మేర నష్టం జరిగిందన్న ప్రాథమిక అంచనా వివరాలను వెల్లడించిన సీఎం రేవంత్.. కేంద్రం వెంటనే సాయం అందజేయాలని కోరారు. మరోవైపు రాష్ట్ర సీఎస్ కూడా కేంద్ర హోం మంత్రికి లేఖ రాసినట్లు ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. ఈ సమయంలోనే కేంద్ర హోంశాఖ కూడా సీఎస్కు ఒక లేఖ రాసింది. ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్) నిధులను కోరుతూ.. రాష్ట్రం నుంచి ఇప్పటివరకు తమకు ఎలాంటి లేఖ రాలేదని, వరదల తాజా పరిస్థితిపైనా రిపోర్టును పంపలేదని కేంద్ర హోంశాఖలోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వింగ్ డైరెక్టర్ ఆశిష్ గవాయ్ ఆ లేఖలో తెలిపారు. రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నష్టం సంభవించిందని, సహాయక చర్యల కోసం కేంద్రం తరఫున ఏడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్రంలోనే ఉన్నాయని, హకీంపేటలో రెండు ఆర్మీ హెలికాప్టర్‌లను కూడా ఉంచినట్లు గుర్తు చేశారు. సహాయక చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం తగిన చొరవ తీసుకున్నదని వివరించారు. రాష్ట్రంలోని వరద పరిస్థితిపై స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్ఈఓసీ) నుంచి తమకు టెలిఫోన్ ద్వారా సమాచారం అందిందని, ఏ మేరకు నష్టం జరిగిందనే వివరాలు వచ్చాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం కేంద్ర హోంశాఖ కంట్రోల్ రూమ్‌కు ఎలాంటి రిపోర్టు రాలేదని నొక్కి చెప్పారు.

నిబంధనల ప్రకారం రాష్ట్రం నుంచి రాతపూర్వకంగా పూర్తి వివరాలతో నివేదిక అందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ దగ్గర రూ. 1,345.15 కోట్లు సిద్ధంగా ఉన్నాయని, ఏప్రిల్ 1 నాటికి అకౌంట్‌లో ఈ నిల్వలు ఉన్నట్లు రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ నివేదికలో పేర్కొన్నారని గుర్తుచేశారు. వరదల లాంటి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ ఖాతాలోంచి నిధులను వాడుకోవచ్చని వివరించారు. ఈ లేఖ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై బాధితులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఖజానాలో రూ.1,345 కోట్ల ఎస్డీఆర్‌ఎఫ్‌ నిధులు ఉన్నా, బాధితులకు తక్షణ సాయం అందించేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. వరద బాధితులకు కుటుంబానికి కొంత నగదు, నిత్యవసరాల కిట్లు పంపిణీ చేస్తే ఉపశమనం కలిగేది కదా అని వాపోతున్నారు.

Tags

Next Story