Harish Rao: మంకీపాక్స్ విషయంలో ఆందోళన అవసరం లేదు: హరీష్ రావు
Harish Rao: మంకీపాక్స్‌పై ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు మంత్రి హరీష్ రావు. మంకీపాక్స్ లక్షణాలు, పరీక్షలు, చికిత్స వంటి అంశాలపై డీఎంఈ, టీవీవీపీ వైద్యులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. అనుమానిత లక్షణాలతో ఉన్నవారు కూడా రాలేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ధారణ పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రిలో ఏర్పాట్లు చేశామన్నారు.
ఇక డబ్ల్యూహెచ్‌ఓ, ఐసీఎంఆర్ మార్గదర్శకాలు పాటిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇక మంకీ పాక్స్ లక్షణాలు, పరీక్షలు, చికిత్స విధానం పట్ల వైద్యులందరూ అవగాహన పెంచుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందికి వివరించాలన్నారు. వైరస్‌కు సంబంధించిన లక్షణాలు గుర్తించిన వెంటనే బాధితుల నుంచి నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
ఉత్తర తెలంగాణ వాసులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో హెల్త్ సిటీ నిర్మాణం జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో నిర్మిస్తున్న హెల్త్ సిటీ పనులను మరో మంత్రి ఎర్రబెల్లితో కలసి ఆయన పరిశీలించారు. తెలంగాణలో ఎక్కడలేని విధంగా 1200 కోట్లతో 56 ఎకరాల్లో హెల్త్ సిటీని నిర్మిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అటు సూపర్ స్పెషల్ ఆస్పత్రి నిర్మాణ పనులతీరును మంత్రులు సమీక్షించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com