HAYATH NAGAR CI: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నాం: సీఐ

యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. నవ సమాజ నిర్మాణంతో కీలక పాత్ర పోషించాల్సిన యువత... డ్రగ్స్‌కు బానిసైతే దేశ మనుగడకే ప్రమాదమని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం... ఈగల్ పేరుతో పటిష్ట నిఘా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. డ్రగ్స్ పై డేగ కన్ను వేసింది. విద్యార్థులు, యువత భవిష్యత్తు కాపాడేందుకు పోలీసులు కూడా శక్తివంచన కూడా కృషి చేస్తున్నారు. డ్రగ్స్ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలపై. హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ...
ప్రశ్న: కొంతమంది యువత డ్రగ్స్‌కు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. వారిని కాపాడేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జవాబు: యువతే దేశ భవిష్యత్తు. వారు డ్రగ్స్ వలలో చిక్కుకోకుండా ఉండేందుకు ప్రతిరోజూ విద్యా సంస్థల దగ్గర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి మాదకద్రవ్యాల భయంకర ఫలితాలపై అవగాహన కల్పిస్తున్నాం. వారిలో సానుకూల మార్పు కోసం కౌన్సిలింగ్ కూడా అందిస్తున్నాం.
ప్రశ్న: డ్రగ్స్ నియంత్రణకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు?
జవాబు: డ్రగ్స్ సరఫరా, వినియోగంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నాం. సమాచారం అందిన వెంటనే స్పందించి కేసులు నమోదు చేసి కఠినంగా విచారణ జరుపుతున్నాం. డ్రగ్స్ విక్రయదారులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కఠినంగా కేసులు నమోదు చేస్తున్నాం.
ప్రశ్న: డ్రగ్స్ కేసులో పట్టుబడితే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది?
జవాబు: ఎన్‌డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోథెరపీ సబ్‌స్టాన్స్ యాక్ట్ ) ప్రకారం డ్రగ్స్ కలిగి ఉండటం, విక్రయించడం, తరలించడం వంటి వాటికి కఠిన శిక్షలు ఉన్నాయి. మోతాదు ఆధారంగా 10 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. భారీగా జరిమానాలు కూడా విధిస్తారు.
ప్రశ్న: విద్యా సంస్థల్లో డ్రగ్స్ కట్టడికి ఎలాంటి అవగాహన చర్యలు తీసుకుంటున్నారు?
జవాబు: విద్యాసంస్థలతో కలిసి మేము "డ్రగ్స్ మీద డేగ కన్ను" కార్యక్రమాన్ని ప్రారంభించాం. స్పెషల్ లెక్చర్లు, అవగాహన ర్యాలీలు, విద్యార్థులతో ముఖాముఖీ చర్చల ద్వారా వారిలో చట్టపరమైన అవగాహన కలిగిస్తున్నాం. మాదకద్రవ్యాలు వాడటం వల్ల ఆరోగ్యపరంగా, చట్టపరంగా ఎదురయ్యే సమస్యలు వివరంగా తెలియజేస్తున్నాం.
ప్రశ్న: సరదాగా మొదలైన డ్రగ్స్ అలవాటు... తర్వాత వ్యసనంగా మారుతోంది. వారికి పోలీసుల తరపున మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు?
జవాబు: యువతలో ఒక ఆశ ఉందని మేము నమ్ముతున్నాం. ఒక్కసారి వ్యసనానికి బానిసైతే జీవితం నాశనం అవుతుంది. సరదాగా తీసుకునే డ్రగ్... చివరికి చావు బాట పట్టించొచ్చు. అందుకే, వారు తప్పు మార్గంలో ఉంటే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. మేము వారిని కౌన్సిలింగ్ ద్వారా మారుస్తాం. శిక్షల నుంచి తప్పించేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తాం.
ప్రశ్న: చిన్నపిల్లలకు చాక్లెట్లు రూపంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీని కట్టడి కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జవాబు: ఇది చాలా ఆందోళనకరమైన విషయం. చిన్నారులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ చాక్లెట్, బిస్కట్ లాంటి రూపాల్లో విక్రయిస్తున్న వారి పట్ల మేము ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నాం. స్కూళ్ల పరిసరాల్లో సందేహాస్పద వ్యక్తులపై నిఘా పెట్టి వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ప్రశ్న: మూలాల నుంచి గంజాయి కట్టడికి చర్యలు చేపట్టారా?
జవాబు: గంజాయి సప్లై చేసే మూలాలపై నేషనల్ లెవెల్‌లో కూడా సమన్వయం జరుపుతున్నాం. మేము ఇతర రాష్ట్రాల పోలీస్ శాఖలతో కలిసి ఇంటెలిజెన్స్ ఆధారంగా జరుగుతోందో, అక్కడే నిర్మూలన చర్యలు తీసుకుంటున్నాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com