HCA : ఉప్పల్ స్టేడియంకు మంచి రోజులు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఉప్పల్ స్టేడియానికి మంచి రోజులు వచ్చాయి. ప్రపంచకప్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంతో సహా దేశంలోని మరో నాలుగు మైదానాల్ని ఆధునికీకరించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, మొహాలీ, ముంబయి స్టేడియాల్లో వసతులపై తరచూ ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో.. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో వన్డే ప్రపంచకప్‌లోపు ఈ అయిదు వేదికల్లోని స్టేడియాల్ని బోర్డు ఆధునికీకరించనుంది. ఇందుకోసం సుమారు 500 కోట్లు ఖర్చు చేయనుంది.
హైదరాబాద్ స్టేడియానికి 117 కోట్లు, ఢిల్లీకి 100 కోట్లు, కోల్‌కతాకు 127 కోట్లు, మొహాలీకి రూ.79 కోట్లు, ముంబయికి 79 కోట్లు వెచ్చించనుంది. మొహాలీలో ప్రపంచకప్ మ్యాచ్‌లు లేకపోయినా అక్కడి స్టేడియాన్నీ బాగు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఉప్పల్ స్టేడియంలో ఉత్తర, దక్షిణ స్టాండ్లపై పైకప్పు ఉంది. దక్షిణం వైపు దెబ్బతిన్న పైకప్పు మరమ్మత్తు పనులు ఎప్పట్నుంచో పెండింగులో ఉన్నాయి. ప్రపంచకప్ ఆతిథ్యం నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఆధునికీకరించాలని బీసీసీఐ భావిస్తే మాత్రం.. ఉప్పల్ స్టేడియం రూపురేఖలు మారిపోతాయి. మూత్రశాలలు, కుర్చీలు, లైటింగ్, ఇంటీరియర్, వాటర్ ప్రూఫింగ్, డిజిటల్ స్కోరుబోర్డు, మీడియా సెంటర్, ఇంటర్నెట్ ఇతరత్రా వసతుల్ని మెరుగుపరచాలని బోర్డు నిర్ణయించింది. ప్రపంచకప్ ఆతిథ్యం కోసం బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువాహటి, హైదరాబాద్, కోల్‌కతా, లఖ్‌నవూ, ఇందౌర్, రాజ్‌కోట్, ముంబయి, అహ్మదాబాద్ వేదికల్ని బీసీసీఐ ఎంపిక చేసింది. 46 రోజుల పాటు సాగే ప్రపంచకప్‌లో 48 మ్యాచ్‌లు జరుగుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com