కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాడు.. కానీ అతడు లేడు..

ఇష్టంగా కష్టపడ్డాడు.. ఇష్టమైన కొలువులో ఉద్యోగం సంపాదించుకున్నాడు.. కానీ విధికి కన్నుకుట్టినట్టుంది.. ముందున్న జీవితాన్ని చూడకముందే మృత్యువు ముంచుకొచ్చి అతడిని పొట్టన పెట్టుకుంది.
భద్రాచలం టేకులపల్లి మండలం రాంపురం పంచాయితీ తండాకు చెందిన భూక్య ప్రేమకుమార్, పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు ప్రవీణ్ (22) బీటెక్ పూర్తి చేసాడు. ఇంతలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు పడితే వాటికి అప్లై చేశాడు. దానికి సంబంధించిన పరీక్షలు రాసి సివిల్స్ కోచింగ్ తీసుకుందామని దిల్లీ వెళ్లాడు. ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నాలుగు రోజులు సెలవులు దొరకడంతో దిల్లీ నుంచి ఖమ్మంలో ఉన్న తన స్నేహితుడి వద్దకు వచ్చాడు. ఆగస్ట్ 17న స్నేహితునితో కలిసి నగరంలో ఓ ప్లెక్సీని కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి షాక్‌కు గురై మృతి చెందాడు. అనంతరం ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాల్లో ప్రవీణ్ ఎంపికయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com