Khammam: ఓ ఎన్నారై విషాద గాధ.. చనిపోతున్నానని తెలిసి అన్ని ఏర్పాట్లు చేసుకుని..

Khammam: ఓ ఎన్నారై విషాద గాధ.. చనిపోతున్నానని తెలిసి అన్ని ఏర్పాట్లు చేసుకుని..
Khammam: పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు.. మృత్యువు నీడలా వెన్నంటే ఉన్నా దాని గురించి ఆలోచించడానికి కూడా భయం వేస్తుంది.

Khammam: పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు.. మృత్యువు నీడలా వెన్నంటే ఉన్నా దాని గురించి ఆలోచించడానికి కూడా భయం వేస్తుంది. కానీ తాను ఎక్కువ కాలం బతకనని డాక్టర్లు చెప్పడంతో ఓ ఎన్నారై తన డెడ్ బాడీని స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు ముందుగానే చేసుకున్నారు. హృదయాన్ని కదిలించే ఈ సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన 33 ఏళ్ల హర్షవర్ధన్ కథ హృదయం ఉన్న ప్రతి ఒక్కరిన్ని కదిలిస్తుంది.

బి-ఫార్మసీ పూర్తి చేసిన హర్షవర్ధన్ ఉన్నత చదువుల కోసం అని 2013లో ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ అతను బ్రిస్బేన్ విశ్వవిద్యాలయం నుండి హెల్త్ మేనేజ్‌మెంట్, జనరల్ మెడిసిన్ పూర్తి చేశాడు. క్వీన్స్‌లాండ్‌లో వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఫిబ్రవరి, 2020లో హర్షవర్ధన్ ఖమ్మం వచ్చి,తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అదే నెలలో తిరిగి ఆస్ట్రేలియా వెళ్లి పోయారు. భార్యను వీసా పని పూర్తయిన తరువాత తీసుకువెళతానని చెప్పాడు. అయితే అదే సంవత్సరం అక్టోబర్‌లో, అతను ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు. ఆగకుండా వస్తున్న దగ్గుతో అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేయించుకున్న తరువాత హర్షవర్ధన్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. దాంతో ఆస్ట్రేలియాలోనే చికిత్స తీసుకోవడం మొదలు పెట్టాడు. పూర్తిగా తగ్గిపోయింది అని డాక్టర్లు చెప్పడంతో సంతోషించాడు. కానీ 2022లో క్యాన్సర్ మళ్లీ అతడిని ఇబ్బంది పెట్టింది. వైద్యులు హర్షవర్ధన్‌ని పరీక్షించి వ్యాది ముదిరిపోయిందని, ఎక్కువ కాలం బతికే అవకాశం లేదని చెప్పారు. దాంతో హర్షవర్ధన్ తాను బ్రతికి ఉన్నప్పుడే పూర్తి చేయాల్సిన పనుల గురించి ఆలోచించాడు. మృత్యువు తన వెన్నంటే ఉందని తెలిసి సమయం లేదని తొందరపడ్డాడు. ఏ ఒక్క నిమిషాన్ని వేస్ట్ చేయలేదు. ఉన్నన్ని రోజులు సంతోషంగా గడిపాడు.. అందరికీ ఫోన్లు చేసి రోజూ పలకరించేవాడు.

తన క్యాన్సర్ గురించి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేశాడు. ప్రతి రోజు, హర్షవర్ధన్ తన తండ్రి, తల్లి, స్నేహితులతో వీడియో కాల్‌లో మాట్లాడేవాడు. తన భార్య జీవితం అన్యాయం అయిపోకూడదని భావించి ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆమె సెటిల్ అవ్వడం కోసం తగిన ఏర్పాట్లు చేశాడు. అతని రోజువారీ దినచర్యను చాలా సాధారణంగా గడిపేవాడు. హర్షవర్ధన్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నందున, అతని మరణానంతరం అతని భౌతిక కాయాన్ని స్వదేశానికి రప్పించడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. అందుకోసం ఒక న్యాయవాదిని నియమించుకున్నాడు. ఆస్ట్రేలియా చట్టం అన్ని విధానాలను అనుసరించి, హర్షవర్ధన్ అన్ని ఆమోదాలను పొందారు. ఆరోజు రానే వచ్చింది. మార్చి 24న హర్షవర్ధన్ తుది శ్వాస విడిచారు.

బుధవారం (ఏప్రిల్ 5) హర్షవర్ధన్ భౌతికకాయం ఖమ్మం వచ్చింది. కుటుంబ సభ్యుల రోదనల మధ్య అతడి అంత్యక్రియలు పూర్తి చేశారు. హర్ష బతికి ఉంటే తమ్ముడు అఖిల్ పెళ్లి కోసం మే నెలలో ఇండియా వచ్చేవాడు. కానీ విధి రాత మరోలా ఉంది. దానికి ఎవరైనా తలవంచక తప్పదు.

Tags

Next Story