తెలంగాణలో తీరని నష్టాన్ని మిగిల్చిన కుంభవృష్టి

తెలంగాణలో తీరని నష్టాన్ని మిగిల్చిన కుంభవృష్టి
తెలంగాణలో కుంభవృష్టి తీరని నష్టాన్ని మిగిల్చింది.. రైతులను కోలుకోలేని దెబ్బతీసింది.. చేతికందే సమయంలో పంటలు నీట మునగడంతో అన్నదాతల ఆవేదన చెప్పనలవి కాకుండా..

తెలంగాణలో కుంభవృష్టి తీరని నష్టాన్ని మిగిల్చింది.. రైతులను కోలుకోలేని దెబ్బతీసింది.. చేతికందే సమయంలో పంటలు నీట మునగడంతో అన్నదాతల ఆవేదన చెప్పనలవి కాకుండా ఉంది.. పంట నష్టంతోపాటు ఎంతో మంది గూడును కోల్పోయి రోడ్డున పడ్డారు.. కొన్ని ప్రాంతాల్లో రహదారులు రూపు రేఖలు లేకుండా పోయాయి.. అటు అధికారులు నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరాలు అందజేశారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కోట్లకు పైగా నష్టం వచ్చిందని పేర్కొన్నారు. తక్షణ సాయం, పునరావాస చర్యల కోసం 13వందల 50 కోట్ల సాయాన్ని కోరారు. తక్షణ సాయం కింద రైతులకు 600 కోట్లు.. జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర ప్రాంతాలకు 750 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే, భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావాల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతి ఇంటికీ మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని చెప్పారు. హైదరాబాద్‌ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జీహెచ్‌ఎంసికి 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇండ్లుపూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు మంజూరు చేస్తామని, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల మరమ్మతులకు ఆర్ధిక సాయం అందిస్తామని సీఎం చెప్పారు.

నాలాలపై కట్టిన ఇండ్లు కూడా కూలిపోయాయని, వాటి స్థానంలో ప్రభుత్వ స్థలంలో కొత్త ఇండ్ల నిర్మాణం జరుపుతామని సీఎం స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాలు, అపార్ట్‌మెంట్లు సెల్లార్లలో నీళ్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించి, విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించాలని అధికారులకు సూచించారు. నీళ్లుండగానే విద్యుత్‌ సరఫరా చేయడం ప్రమాదం కనుక ఒకటీ రెండు రోజులు ఇబ్బంది కలిగినా ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు నీళ్లు పూర్తిగా తొలగిన తర్వాతనే విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించారు.

హైదరాబాద్‌ నగరంలో చాలా చోట్ల చెరువుల ఎఫ్‌టిఎల్‌ పరిధిలోని కాలనీలే జలమయమయ్యాయని సీఎం చెప్పారు. అపార్ట్‌మెంట్‌ల సెల్లార్‌లలో నీళ్లు నిలవడం వల్ల కూడా చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లలో నీళ్లు నిల్వకుండా ఉండేలా నిర్మాణ సమయంలోనే ఏర్పాటు చేయాల్సిందన్నారు. ఇక నుంచి అపార్ట్‌మెంట్‌ల నిర్మాణానికి అనుమతి ఇచ్చే సందర్భంలో వరద నీరు సెల్లార్లలో నిలిచి ఉండకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాలనే నిబంధన పెట్టాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 7.35 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు సీఎంకు వివరించారు అధికారులు. వీటి నష్టం విలువ సుమారు 2వేల కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story