Telangana Weather: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు..

Telangana Weather: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు..
X
మరో నాలుగు రోజుల దాకా వానలే వానలు..

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆది, సోమవారాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ రోజు (ఆదివారం) కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారీ వానలు పడతాయని హెచ్చరించింది. ఈ జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఇతర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు (సోమవారం) కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్‌ను కూడా జారీ చేసింది. రేపు ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

ఇక మంగళవారం(సెప్టెంబర్ 10) ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఇక బుధవారం, గురువారం అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడవచ్చని తెలిపింది.

Tags

Next Story