తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వివిధ జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతుంది. పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. రంగారెడ్డి జిల్లా షాపూర్‌లో ఓ..

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వివిధ జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతుంది. పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. రంగారెడ్డి జిల్లా షాపూర్‌లో ఓ కుటుంబానికి చెందిన 8 మంది సభ్యులు వాగులో కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఏడుగురు సురక్షితంగా బయటపడగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. షాపూర్‌ తండాకు చెందిన దశరథ్‌.. తన కుటుంబంతో కలిసి పొలానికి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో.. తన పిల్లలు, భార్య వాగులో కొట్టుకుపోయారు. దశరథ్‌ ఏడుగురు పిల్లలను రక్షించాడు. ఐతే.. భార్యను కూడా వాగు నుంచి బయటికి తీసుకొచ్చినా.. అప్పటికే ఆమె మృతి చెందింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామ సమీపంలో దుంధూబి వాగులో చిక్కుకుపోయారు భార్యాభర్తలు. వాగులో చెట్టును పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలు చేపట్టారు.

నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగామ్‌ గ్రామంలో ప్రాణాపాయం తప్పింది. ముగ్గురు బాలురులు చేపల వేటకు వెళ్లి వాగులో చిక్కుకున్నారు. వాగుకు హఠాత్తుగా వరదలు రావడంతో.. అందులో చిక్కుకుపోయారు. ఐతే వెంటనే స్పందించిన గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టి ముగ్గురిని క్షేమంగా కాపాడారు. అటు మూగ జీవాలు వరదలతో అల్లాడిపోతున్నాయి. వాగులో కొట్టుకుపోతున్న ఓ కుక్కును ప్రాణాలకు తెగించి కాపాడాడు కానిస్టేబుల్. గత నాలగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నాగర్ కర్నూలు జిల్లాలో వాగులు పొంగుతున్నాయి. అయితే వరదలో చిక్కుకుపోయిన కుక్కును కానిస్టేబుల్ జేసీబీ సహాయంతో కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఆయన సాహసాన్ని స్థానికులు ప్రశంసించారు. వనపర్తి పట్టణంలో తాళ్ల చెరువు ఆలుగు పారడంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి ముందున్న ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో ఉన్న కిటికీలలో నుంచి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది.

నారాయణపేట జిల్లా ఊట్కూరు మండంలంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. ఊట్కూరు గేట్‌ సమీపంలో కల్వర్టుపై నుంచి వర్షం నీరు పారుతుండటంతో మక్తల్‌ నుంచి నారాయణపేటకు వెళ్లే రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మెదక్ జిల్లా సురారం పెద్ద చెరువుకు భారీ వర్షం నీరు వచ్చి చేరింది. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్గిలో భారీ వర్షానికి వాగు నిండిపోయింది. దీంతో బ్రిడ్జిపై నుంచి నీరు పొంగి పొర్లుతుంది. ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలతో చెరువులు కుంటలన్ని జలకళ సంతరించుకున్నాయి. గంధమల్ల చెరువు నిండి అలుగు పారడంతో.. దిగువ నుంచి వెళ్తున్న వాహనదారులు దాటే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ఎగువ నుంచి వరద నీరు రావడంతో.. బైక్ పై ఉన్న వ్యక్తి తో సహా బైక్ కొట్టుకుపోయాడు. ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం అవరణలో మెట్లపై నుంచి వర్షపునీరు ప్రవహిస్తుంది.

అటు ప్రాజెక్టులు మరోసారి జలకళను సంతరించుకున్నాయి. నాగార్జునసాగర్‌ 20 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.నాగార్జునసాగర్‌కు రికార్డ్ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పర్యాటక తాకిడి పెరిగింది. ఇక.. శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు ఇన్ ఫ్లో 2లక్షల 21వేల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం40 గేట్లు ఎత్తేసిన అధికారులు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story