Hyderabad Rains : భారీ వర్షాలకు నగరంలో పొంగి పొర్లుతున్న నాలాలు..

Hyderabad Rains : హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ముసురు పట్టేసింది. ఈరోజు కూడా నగరంలోని పలుచోట్ల కురిసిన వర్షం కారణంగా నాలాలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి భారీగా నీరు రావడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో అయితే.. మురుగు నీరు ఇళ్లలోకి చేరడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాగల రెండు రోజులు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈరోజు ఖైరతాబాద్, లక్డీ కపూల్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపుం, హిమాయత్ నగర్, గాంధీ నగర్, నారాయణగూడ, బషీర్ బాగ్, కవాడీ గూడ, ఆబిడ్స్, నాంపల్లి, అసెంబ్లీ, బషీర్‌బాగ్, కోఠి, సుల్తాన్‌బజార్, బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, అబిడ్స్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.
వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ముసారాంబాగ్‌లో కురిసిన భారీ వర్షానికి బ్రిడ్జి నీట మునిగింది. బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. దీంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.
ఖైరతాబాద్‌లో దంచికొట్టిన వర్షానికి అక్కడి రోడ్లు చెరువులను తలిపిస్తున్నాయి. మోకాళ్ల లోపు నీరు ఉంటడంతో ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి వెళ్లిన భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండపం వద్ద భారీగా వర్షం పడుతోంది. వర్షంలో తడుస్తూనే భక్తులు మహా గణపతిని దర్శించుకుంటున్నారు. మట్టి గణపతి కావడంతో విగ్రహం తడవకుండా ఏర్పాటు చేశారు. మరోవైపు రేపు మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com