తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
X
గత కొన్ని రోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలు వర్షం రాకతో కాస్త ఉపశమనం పొందారు

తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూరుస్తున్నాయి. హైదరాబాద్‌పై వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌ నగర్‌, మణికొండ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, సుచిత్ర, కొంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలు వర్షం రాకతో కాస్త ఉపశమనం పొందారు. రహదారులపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు.

తెలంగాణలో రాగల 3రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ద్రోణి విదర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. మరోవైపు వచ్చే 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపారు.

ఏపీలోనూ వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పగటిపూట మాత్రం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, కడప జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందన్నారు. కొన్ని చోట్ల గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పొలాల్లో పనిచేసే రైతులు.. గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. పలు ప్రాతాల్లో ఈదురు గాలులు బలంగా వీస్తుండటంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Next Story