Hyderabad Rains : నగరంలో రెయిన్ అలర్ట్.. విరిగిపడుతున్న చెట్లు, పాత భవనాలు

Hyderabad Rains : గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది. దీంతో వివిధ ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. శిథిల భవనాలు కుప్పకూలుతున్నాయి. చెట్లు కింద ఉండొద్దంటూ ఇప్పటికే జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండ క్రాస్ రోడ్‌లో చెట్టు కూలడంతో ట్రాఫిక్ జామ్ అయింది. కూలిన చెట్లను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. అటు.. కొత్తపేట BJR భవన్‌లో చెట్టు నేలమట్టమైంది. అంబర్‌పేట్ తిరుమలనగర్‌లో చెట్టు, విద్యుత్ స్తంభం పడి రెండు కార్లు, ద్విచక్రవాహనం ధ్వంసమయ్యాయి.
మరోవైపు శిథిలావస్తకు చేరిన ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు. అయితే కొందరు పెడచెవిన పెడుతున్నారు. దీంతో కుత్భుల్లాపూర్ పరిధిలోని సూరారంలో బిల్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వివేకానంద, తహసీల్దార్ సంజీవరావు తక్షణ సాయంగా 50వేలు అందజేశారు. సూరారం తెలుగుతల్లి నగర్‌లోని ఇంటి స్లాబ్ పెచ్చులూడి లలిత అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఇల్లు 35 ఏళ్ల క్రితం నిర్మించారు.
శిథిల భవనాలపై జీహెచ్‌ఎంసీ ఫోకస్ పెట్టింది. 524 భవనాలను గుర్తించారు. రెండు రోజుల్లో 45 భవనాలు కూల్చేశారు. 78 భవనాలను సీజ్ చేసి.. నివాసితులను ఖాళీ చేయించారు. ఇప్పటి వరకు 185 భవనాలు కూల్చివేయగా.. మూడు వందల భవనాలను ఖాళీ చేయించారు.
సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో వర్షాలకు నానిపోవడంతో ఫాల్ సీలింగ్ పైకప్పు ఊడిపడడం ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. అదే సమయంలో అక్కడ నేషనల్ కబడ్డీ క్యాంప్ ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. హర్యానాలో సీనియర్ కబడ్డీ నేషనల్ ఛాంపియన్ షిప్ ఉండడంతో ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఇదే టైమ్‌లో పైకప్పు ఊడిపడింది. ఐతే అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు.
హుస్సేన్‌సాగర్‌లోకి వరద నీరు అంతకంతకు పెరుగుతోంది. నీటి ప్రవాహం డేంజర్ లెవల్‌కు చేరటంతో అధికారుల అలర్ట్ అయ్యారు. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513 మీటర్లు కాగా... ప్రస్తుత నీటి మట్టం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. హుస్సేన్‌సాగర్ నుంచి నీటిని తూముల ద్వారా మూసీలోకి వదలుతున్నా.. నీటిమట్టం తగ్గటం లేదు.
ఇక.. జూపార్క్ వద్ద వరద ఉధృతి మరింత పెరిగింది. మీరాలం చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతుండడంతో.. ఆ వరద అంతా జూలోకి వచ్చేస్తోంది. ఈ ప్రభావంతో సఫారీ జోన్ నీట మునిగింది. ఇక్కడ సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు ఉంటాయి. ఈ వరద ముప్పు ప్రభావంతో జంతువుల్ని ఎన్‌క్లోజర్లకే పరిమితం చేశారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకూ సఫారీని నిలిపివేశారు. అటు.. జంట జలాశయాలకు వరద ఉధృతి కొనసాగుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com