Rains: తెలంగాణలో భారీ వడగళ్ల వాన

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇక్కట్లు పడ్డారు. భారీ వర్షం కురవడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోనే ఈ అకాల వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో వడగండ్లు పడ్డాయి. ధర్మపురి మండలంలో ఈదురుగాలులతో కూడిన వానకురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కూకట్ పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి, మూసాపేట్ ప్రాంతాల్లో వాన కురుస్తోంది. అలానే సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరుగా వాన పడుతోంది. అలానే మరికొన్ని ప్రాంతాలు నల్లని మబ్బులు కమ్ముకుని ఉన్నాయి.
ఈ జిల్లాల్లో వర్షం దంచుడే
వర్షాల కారణంగా మూడురోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కి. మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరో రెండు రోజులు వర్షాలు
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మార్చి 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాల కారణంగా.. వేడి తీవ్రతతో పాటు వడగాలులు సైతం తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీంతో రెండు రోజుల పాటు ప్రజలకు వడగాలుల నుంచి ఉపశమనం పొందనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com