తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్ర మవుతోంది. రాబోయే 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. అంతేకాదు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి వస్తున్నట్లు ఆ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖపట్టణానికి ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా వాయుగుండం ప్రయాణిస్తున్నట్లు వెల్లడించింది. కాకినాడకు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, కర్నాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాల్లో పలు చోట్ల కుంభవృష్టి కురుస్తోంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీగా వానలు పడుతున్నాయి. రాబోయే 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఏపీలో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com