Heavy Rains: తెలంగాణలో 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్..

Heavy Rains:తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గులాబ్ తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారింది. ఛత్తీస్‌గడ్‌కు ఆగ్నేయంగా 90 కిలోమీటర్లు, మల్కన్‌గిరికి ఈశాన్యంగా 65 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై పశ్చిమ దిశగా కదులుతోంది.రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడి ఇవాళ తీవ్ర అల్పపీడనంగా మారనుందని వాతావరణశాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఇవాళ కూడా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
గులాబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇచ్చింది. తెలంగాణలో 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్.. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేశారు. తిరిగి అక్టోబర్ 1 నుంచి ఉభయసభలు ప్రారంభంకానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరో రెండ్రోజులు భారీ వర్ష సూచన ఉండటంతో నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com