తెలంగాణలో దంచి కొడుతున్న వానలు

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన దంచికొట్టింది. అకాల వర్షాలకు రైతులు తీవ్ర నష్టపోయారు. కల్లాల్లో ఉన్న ధాన్యంతో పాటు మార్కెట్లకు తరలించిన ధాన్యం సైతం తడవడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరువుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంలోని గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గంలో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. చందానగర్, మియాపూర్, బాలానగర్, సూరారం, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, అల్వాల్, నేరేడ్‌మెట్, మల్కాజిగిరి, అమీర్‌పేట, పంజాగుట్ట, ఈసీఐఎల్, ఏఎస్‌రావు నగర్, కాప్రా, కూకట్‌పల్లి, మూసాపేట్, ప్రగతినగర్, బాచుపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది.
సంతోష్ నగర్, చంపాపేట్, సైదాబాద్, సరూర్‌నగర్, పాతబస్తీ పరిధిలోని బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, బార్కాస్, పురాణపుల్‌లో కురుస్తోన్న వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాలోని రహదారులు జలమయం అయ్యాయి. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, రాంనగర్, అడిక్ మెట్, దోమలగూడ, కవాడిగూడ, గాంధీ నగర్, అంబర్‌పేట, గోల్నాక, కాచిగూడ, నల్లకుంట, విద్యానగర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక అకాల వర్షాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు అలెర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజ ల్ని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజల్ని బయటకు రావొద్దని సూచించారు. సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగింది.
మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 10గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను టీఎస్‌డీపీఎస్ ప్రకటించింది. సిద్దిపేట జిల్లా దూల్‌మిట్టలో అత్యధికంగా 83.5 మిల్లిమీటర్లు, సంగారెడ్డి జిల్లా ఆర్.సిపురంలో 79.8, రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో 77.5, యాదాద్రి జిల్లా నందనంలో 77.8, భువనగిరిలో 73.8, మేడ్చల్ జిల్లా కీసరలో 75, మల్కారంలో 71.3, సిద్దిపేట జిల్లా గండిపల్లిలో 69.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com