TG: తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వానలు పడతాయని పేర్కొంది. అలాగే రేపు(ఆదివారం)మంచిర్యాల, భూపాలపల్లి, ఆసిఫాబాదు జిల్లాల్లో అతిభారీ వానలు పడతాయంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈనెల 9వ తేదీ వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షం పడవచ్చని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నేటి నుంచి రూ.10 వేల జమ
మరోవైపు నేటి నుంచి ఖమ్మం వరద బాధితుల ఖాతాల్లో రూ.10వేల నగదును ప్రభుత్వం జమ చేయనుంది. వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున అందిస్తామని ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా సుమారు 22 వేల కుటుంబాలకి రూ.10 వేల చొప్పున పరిహారం బ్యాంకు ఖాతాల్లో జమకానుంది.
29 మంది మృతి
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటిస్తున్నట్లు CS శాంతి కుమారి తెలిపారు. ఇప్పటికే నాలుగు జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేశామని, మిగిలిన 25 జిల్లాలకు రూ.3 కోట్ల చొప్పున సంబంధిత జిల్లా కలెక్టర్లకు నిధులను విడుదల చేస్తామని పేర్కొన్నారు. వర్షాలతో ఇప్పటి వరకు 29 మంది మరణించారని CS తెలిపారు.
పొంగిపొర్లుతున్న దుందుభి నది
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని బోడ జానంపేట వద్ద దుందుభి నది పరవళ్ళు తొక్కుతోంది. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పెద్దయపల్లి, అమ్మపల్లి, బాలానగర్, ఉడిత్యాల, నందారం తదితర గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. వేరుశనగ, వరి, మొక్కజొన్న, జొన్న ఇతర ఆరుతడి పంటల సాగుకు అనుకూలంగా ఉంటుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com