RAINS: తుఫాను ముప్పు.. భారీ వర్షాలు

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం ఈ నెల 24న వాయువ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా మీదుగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తుఫాను ప్రభావంతో ఈ నెల 24, 25 తేదీలలో కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో తుపాన్ ప్రభావంతో 24 గంటలపాటు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష సూచనలో ఏపీలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలున్నాయి. రాయలసీమ జిల్లాలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయి. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకపోవడమే మంచిది.
తెలంగాణలోనూ..
తెలంగాణలో ఉక్కపోత వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అత్యధికంగా భద్రాచలంలో 34.4 డిగ్రీల ఉష్ణోగ్రత, నిజామాబాద్ లో 34.3 డిగ్రీలు, రామగుండంలో 32.4 డిగ్రీలు, ఆదిలాబాద్, దుండిగల్ లో 31.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వరంగల్, హనుమకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
విపరీతమైన వర్షాలు.. పెరిగిన కూరగాయల ధరలు
గద్వాల్ జిల్లా లో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం కూరగాయల ధరలు అధికంగా పెరిగాయి. క్యారెట్ కేజీ రూ.60 నుంచి రూ.80, క్యాప్సికం కేజీ రూ.80, బీన్స్ కేజీ రూ.80, ఉల్లిపాయలు కేజీ రూ.60 ఇలా కూరగాయల ధరలు అధికంగా ఉండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కూరగాయల పంటలు సాగు దెబ్బ తినడంతో రేట్లు అధికంగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com