భారంగా మారిన హెవీ వెహికల్ లైసెన్స్ రెనివల్

భారంగా మారిన హెవీ వెహికల్ లైసెన్స్ రెనివల్
హెవీ వెహికల్ లైసెన్స్ గడువు పూర్తయిన డ్రైవర్లు.. వాటిని పునరద్ధరించుకోవాలంటే తప్పనిసరిగా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరిసిల్లకు వెళ్లాల్సి వస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన వల్ల ఖమ్మం జిల్లా డ్రైవర్లకు భారంగా మారింది. హెవీ వెహికల్ లైసెన్స్ గడువు పూర్తయిన డ్రైవర్లు.. వాటిని పునరద్ధరించుకోవాలంటే తప్పనిసరిగా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరిసిల్లకు వెళ్లాల్సి వస్తోంది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్, ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఐడీటీఆర్‌ నుంచి ఒక రోజు శిక్షణ తీసుకున్నట్లు ద్రువీకరణ పత్రం తీసుకొని ఖమ్మం ఆర్టీఏలో సమర్పించాల్సి వస్తోంది.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పది వేలకు పైగా హెవీ వెహికల్ లైసెన్స్‌ కలిగిన డ్రైవర్లు ఉన్నారు. వీరంతా తమ లైస్సెన్స్‌లు గడువు తీరిన తర్వాత స్థానికంగా ఆర్టీఏ కార్యాలయంలోనే రెన్యూవల్‌ చేయించుకునేవారు. కానీ కొత్త నిబంధనతో ఐడీటీఆర్ సర్టిఫికెట్ కోసం ఖమ్మం నుంచి సిరిసిల్ల వెళ్లాల్సి వస్తోంది. అది కూడా ఉదయం 9.30 గంటల లోపే అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆలస్యంగా వెళ్తే ఆ రోజు శిక్షణకు స్లాట్‌ను కేటాయించరు. ఆ రోజంతా అక్కడే ఉండాల్సి వస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు.

750 రూపాయలు డ్రైవర్లు రుసుమ చెల్లిస్తే డ్రైవింగ్‌లో శిక్షణ తరగతులు, టెస్ట్ నిర్వహించి ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తారు. మెడికల్, ఐడీటీఆర్ పత్రాలను అప్‌లోడ్ చేసి మరుసటి రోజుకు ఖమ్మంలో రెన్యూవల్‌ స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత జిల్లా రవాణశాఖ అధికారులు పత్రాలను తనిఖీ చేసి డ్రైవింగ్ పరీక్ష నిర్వహించి లైసెన్స్ మంజూరు చేస్తున్నారు. మొత్తం ప్రక్రియ పూర్తికావడానికి మూడు రోజులకు పైగా సమయం పడుతుందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హెవీ వెహికల్‌ డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణకు ఐడిటీఆర్‌ తప్పనిసరి అంటున్నారు బ్రేక్ ఇన్‌స్పెక్టర్ వరప్రసాద్. ఒక రోజు శిక్షణ పొందినట్లు ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అన్ని పత్రాలను తనిఖీ చేసి.. డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్‌లను రెన్యువల్ చేస్తున్నామంటున్నారు.

ఖమ్మం జిల్లాలో ఐడీటీఆర్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసి రెండున్నరేళ్లు దాటిన కార్యరూపం దాల్చలేదు. నిధులు విడుదలైనా.. స్థల సేకరణ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఖమ్మంలో ఐడీటీఆర్‌ సెంటర్ ఏర్పాటైతే డ్రైవింగ్ శిక్షణతో పాటు లైసెన్స్ రెన్యూవల్‌ కష్టాలు పోతాయంటున్నారు డ్రైవర్లు.

Tags

Read MoreRead Less
Next Story