HIGH ALERT: అప్రమత్తంగా ఉన్నాం... అన్ని చర్యలు తీసుకున్నాం

తెలంగాణ వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పాత ఇళ్లలో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని చెప్పారు. నదులు, వాగులపై నీటిప్రవాహం ఉంటే అటు వైపు రాకపోకలు నిషేధించాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా నగర, పురపాలక, గ్రామ పంచాయతీ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వేర్వేరుగా స్పందించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉందని.. ప్రజలకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించామని.. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను ఆ జిల్లాలకు పంపించామన్నారు మంత్రి శ్రీనివావస్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఎప్పటికప్పుడు ఆయా జిల్లా అధికారులతో మానిటరింగ్ చేస్తున్నట్టు వెల్లడించారు. కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు తరలించి తగిన భోజన వసతి, వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో ఎన్నడూ కురవని వర్షాలు ఈ సారి మెదక్, కామారెడ్డిలో కురిశాయని.. అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోచారం ప్రాజెక్ట్ తెగే ప్రమాదం ఉందని.. ఆ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలెర్ట్ చేశామన్నారు. అన్ని రకాలుగా ప్రభుత్వ సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని... ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రైళ్ల రాకపోకలు రద్దు..
కామారెడ్డి జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ భారీగా వరద నీరు నిలిచిపోయింది. రైల్వే ట్రాకులు మునిగిపోయాయి. దీంతో రెండు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు అధికారులు. మధ్యాహ్నం నిజమాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన రాయలసీమ రైలును, కాచిగూడ నుంచి మెదక్ వెళ్లే రైలును కూడా రద్దు చేశారు అధికారులు. కామారెడ్డిలో దాదాపు 10 కాలనీలు నీటిలో మునిగాయి. జిల్లా కేంద్రంలో అశోక్ నగర్ కాలనీలో రైల్వే గేటు వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రైల్వే గేటు కాస్త మునిగిపోయింది. అటు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నిండా మునిగింది. ఇక్కడ కార్లు కూడా కొట్టుకుపోతున్నాయంటే వరద ఏ స్థాయిలో ప్రవహిస్తుందో అర్థం చేసుకోవచ్చు. వాగులు, వంకల స్థాయిలో వరద నీరు పట్టణంలో ప్రవహిస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పురాతన ఇళ్లలో ఉంటున్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సీఎం సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com