SC: విద్యుత్‌ విచారణ కమిషన్‌పై హోరాహోరీ వాదనలు

SC: విద్యుత్‌ విచారణ కమిషన్‌పై హోరాహోరీ వాదనలు
X
కేసీఆర్‌ తరపున ముకుల్‌ రోహత్గీ.... తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వీ

ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలుకు... యాదాద్రి, భద్రాద్రి సబ్‌క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్‌ విచారణ కమిషన్‌పై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. తొలుత కేసీఆర్‌ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కమిషన్స్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ యాక్ట్‌ కింద ఏర్పాటుచేసిన ఈ విచారణ కమిషన్‌ ప్రాథమికంగా నిజనిర్ధారణ వ్యవస్థ మాత్రమే అని రోహత్గీ తెలిపారు. ఉత్తర్వుల్లో మాత్రం న్యాయ విచారణకే దీన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారని.. ఇది చట్టవిరుద్ధమని వాదించారు. కమిషన్‌కు అప్పగించిన విచారణాంశాలు ఇప్పటికే ట్రైబ్యునళ్ల ముందు పెండింగ్‌లో ఉన్నాయని... ఇలాంటి సమయంలో కొత్త కమిషన్‌ ఏర్పాటు చేయడమంటే ట్రైబ్యునళ్ల పరిధిలోకి చొరబడటమే అని రోహత్గీ వాదనలు వినిపించారు. కమిషన్స్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ చట్టంలోని సెక్షన్‌-3 ప్రకారం హింసాత్మక ఘటనలపైనే ఇలాంటి కమిషన్‌ ఏర్పాటు చేయాలి తప్పితే రాష్ట్ర ప్రభుత్వాలు కార్యనిర్వాహక అధికారాల్లో భాగంగా తీసుకొనే నిర్ణయాలపై కాదన్నారు. ఛైర్మన్‌ జూన్‌ 11నే విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.


ముకుల్‌రోహత్గీ వాదనల్లో... కమిషన్‌ ఛైర్మన్‌ పక్షపాతంగా వ్యవహరించారన్న ఒక్క వాదనను మినహాయించి, మిగిలిన వాటిని తాము పరిగణనలోకి తీసుకోవడంలేదని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పష్టంచేశారు. ఈ కమిషన్‌ ఏర్పాటుకు కమిషన్స్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ యాక్ట్‌లోని సెక్షన్‌-3 కింద ఉన్న అధికారాలనే ఉపయోగించారని తెలిపారు. అంటే ఇది జ్యుడిషియల్‌ ఎంక్వయిరీ కాదని... ఒకవేళ విద్యుత్‌ కొనుగోళ్లకు పిటిషనరే బాధ్యులని కమిషన్‌ నిర్ధారించినప్పటికీ దాని ఆధారంగా చర్యలు తీసుకోవడానికి కమిషన్‌కు అధికారం లేదన్నారు. ఇది కేవలం విచారణ చేసి సిఫారసులు చేయడంవరకే పరిమితమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల మీరు మీ వాదనలన్నీ కమిషన్‌ ముందు చెప్పుకోండని సూచించారు.

జూన్‌ 11న విలేకరుల సమావేశంలో జస్టిస్‌ నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు, విడుదల చేసిన పత్రికా ప్రకటనపై సీజేఐ అభ్యంతరం వ్యక్తంచేశారు. అందులో ఆయన అప్పటివరకు జరిగిన విచారణ వివరాలను, వివిధ వ్యక్తులు కమిషన్‌కు ఇచ్చిన సమాధానాల సారాంశాన్ని క్లుప్తంగా మాత్రమే వెల్లడించారని ప్రభుత్వం తరఫు న్యాయవాది సింఘ్వీ చేసిన వ్యాఖ్యలతో సీజేఐ ఏకీభవించలేదు. కమిషన్‌ ఛైర్మన్‌ వ్యాఖ్యలు ప్రభావితం చూపేటట్లయితే.. వాటి ప్రభావం లేకుండా విచారణ కొనసాగించాలని ఆదేశించాలన్న వాదనలను సీజేఐ తోసిపుచ్చారు. జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరించినట్లు ఒక్క ఉదంతమైనా చూపమనండని ఆయన తరఫు న్యాయవాది గోపాల్‌ శంకర్‌ నారాయణన్‌ ధర్మాసనానికి విన్నవించారు.

Tags

Next Story