MOHANBABU: మోహన్‌బాబు ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత

MOHANBABU: మోహన్‌బాబు ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత
X
జర్నలిస్టుపై మోహన్‌బాబు దాడి... చినిగిన చొక్కాతో బయటకు వచ్చిన మనోజ్‌

సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో రచ్చకెక్కిన ఇంటి వివాదాలు ముదిరి తారస్థాయికి చేరాయి. మోహన్‌బాబు, ఆయన చిన్న కుమారుడు మనోజ్‌ మధ్య వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద మనోజ్‌ బౌన్సర్లు, మోహన్‌బాబుకు రక్షణగా ఆయన పెద్ద కుమారుడు విష్ణు నియమించిన బౌన్సర్లకు మధ్య ఘర్షణ జరిగింది. మనోజ్‌ దంపతులను మోహన్‌బాబు ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఆయన గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం ఘర్షణను మరింత పెద్దది చేసింది. ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటికి వచ్చిన మోహన్‌బాబు.. మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ దాడిలో ఓ ఛానల్‌ ప్రతినిధికి ఫ్రాక్చర్‌ కాగా, పులువురికి గాయాలు అయ్యాయి. దీంతో జర్నలిస్టు సంఘాలు మోహన్‌బాబు వైఖరిని తీవ్రంగా ఖండించాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి.


మోహన్ బాబు దాడితో జర్నలిస్టుకు తీవ్ర గాయాలు

మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై వీరంగం చేశారు. తన కుమారుడు మనోజ్ జల్‌పల్లిలోని తన నివాసం వద్దకు వచ్చిన సమయంలో జర్నలిస్ట్ రంజిత్‌పై దాడికి పాల్పడ్డారు. . చేతిలో ఉన్న మైక్ ను లాక్కొని జర్నలిస్ట్ రంజిత్ తలపై మోహన్ బాబు బలంగా కొట్టారు. న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడం కలకలం రేపింది. జర్నలిస్టుకు గాయం కాగా, శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. జర్నలిస్ట్ రంజిత్‌కు ఎముకలు విరిగి బోన్ ఫ్యాక్చర్ అయినట్టుగా డాక్టర్లు తెలిపారు. జైగోమాటిక్ ఎముక మూడు చోట్ల విరిగిందని సర్జరీ తప్పదని అన్నట్లు వైద్యులు తెలిపారు.

చిరిగిన చొక్కాతో బయటకు వచ్చిన మనోజ్‌..

మోహన్‌బాబు తెలంగాణ అదనపు డీజీపీని కలిసిన అనంతరం మనోజ్‌ దంపతులు జల్‌పల్లిలో మోహన్‌బాబు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది గేట్లు తీయకపోవడంతో.. ‘నా కుమార్తె లోపల ఉంది’ అంటూ మనోజ్‌ అక్కడి భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు తోసుకుని లోపలికి దూసుకెళ్లారు. మనోజ్‌ వెంట వచ్చిన బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారు. దాడి జరగడంతో చిరిగిన చొక్కాతోనే మనోజ్‌ బయటకు వచ్చారు.

Tags

Next Story